Protest Outside Hindu Temple in England:
రెండు వర్గాల మధ్య ఘర్షణలు..
ఇంగ్లాండ్‌లో హిందు, ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం ఇంకా చల్లారటం లేదు. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లోని స్మెత్‌విక్ టౌన్ (Smethwick town)లో 200 మంది ముస్లింలు ఓ హిందూ ఆలయం బయట నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పాన్ లేన్‌లో ఉన్న దుర్గాభవాని ఆలయం వెలుపల ఈ నిరసనలు జరిగాయి. "అల్లాహు అక్బర్" అంటూ అందరూ నినదించారు. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. కొందరు ఆలయం ప్రహరీ గోడపైకి ఎక్కారు. సోషల్ మీడియాలో అప్నా ముస్లింస్ (Apna Muslims)పేరిట ఓ గ్రూప్ ఉందని, వాళ్లే ఈ నిరసనకు పిలుపునిచ్చారని
పోలీసులు వెల్లడించారు. అయితే...శాంతియుత నిరసన చేపట్టాలని భావించినా....క్రమంగా అది అలజడికి కారణమైంది. ఇటీవల ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇంగ్లాండ్‌లో ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయి. లీసెస్టర్ సిటీలో మొదలై అంతటా పాకుతున్నాయి. ఈ మధ్యే ఓ హిందూ ఆలయాన్ని అవమానించడమే కాకుండా, కాషాయ జెండాను అభ్యంతరకర రీతిలో లాగేయటం స్థానికంగా ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే 47 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్‌లు..
లీసెస్టర్ సిటీ (Leicester city)లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ చెలరేగింది. ఒక్కసారిగా హిందువులంతా వచ్చి చేరుకుని నిరసనలు చేపట్టారు. అదే సమయంలో అక్కడే ఉన్న ముస్లింలు కొంత మంది ఒక్కటయ్యారు. ఫలితంగా...రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ముస్లింలకు చెందిన వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అటు పక్కనే హిందూ ఆలయం కూడా
ఉంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. గొడవ ముదిరి మరీ హింసాత్మకంగా మారకముందే వాతావరణాన్ని చల్లబరిచారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అనుమతి లేకుండా, అప్పటికప్పుడు అక్కడ నిరసనలు చేపట్టారని, అందుకే ఘర్షణ జరిగిందని తెలిపారు. మరికొద్ది రోజుల వరకూ ఆ ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. కొందరు మత పెద్దలు ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి చాలా ప్రమాదకరమని అన్నారు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇలాంటి అలజడి కనిపిస్తోందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఇలా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "మనకు కావాల్సింది శాంతియుత వాతావరణం. ఇప్పటికిప్పుడే అలాంటి ఘటనలు ఆగిపోవాలి. కొందరు యువకులు కావాలనే ఇలాంటివి సృష్టిస్తున్నారు" అని ఓ మతపెద్ద అన్నారు. దశాబ్దాలుగా ఇక్కడి హిందు, ముస్లింలు కలిసి మెలిసి ఉన్నారని, ఉన్నట్టుండి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని చెబుతున్నారు. హింస ద్వారా సాధించేది ఏమీ లేదని చెప్పారు. లీసెస్టర్ ఈస్ట్ ఎంపీ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ హింసను మానుకోవాలని యువతకు సూచించారు.
Also Read: SC Constitution Bench: ఇక నుంచి సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం!