Farmers March Updates: రైతుల ఆందోళనలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. పోలీసులు, రైతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ రైతు గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది.  Kisan Mazdoor Sangharsh Committee (KMSC) సభ్యుడు జ్ఞాన్ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. శంభు సరిహద్దు వద్ద గుండెపోటుతో కుప్ప కూలినట్టు రైతు సంఘ నాయకులు వెల్లడించారు. ఈ ఘటనపై రైతుసంఘ నేత సర్వణ్ సింగ్ పంధేర్ తీవ్రంగా స్పందించారు. ఈ మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 


"ఈ ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణం. వేలాది మంది రైతులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. వాళ్లతో చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు. సరైన సమయానికి మాకు మందులు అందడం లేదు. తిండి తినడానికి కూడా వీల్లేకుండా పోయింది. విశ్రాంతి తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి"


- సర్వణ్ సింగ్ పంధేర్, రైతు సంఘ నేత 


 






రైతుల ఆందోళనలు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతుల్ని దేశ రాజధాని వరకూ రానివ్వకుండా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే వాళ్లను ఆపేస్తున్నారు. భారీ బారికేడ్‌లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాటినీ లెక్క చేయకుండా రైతులు దూసుకొస్తున్నారు. ఆ సమయంలోనే వాళ్లపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది రైతులు గాయపడినట్టు తెలుస్తోంది. కనీసం 100 మంది రైతులు పోలీసులతో జరిగిన ఘర్షణలో గాయపడ్డారని సమాచారం. వీరిలో ముగ్గురు బాధితులు కంటిచూపు కోల్పోయారని వైద్యులు చెబుతున్నారు. పంజాబ్ హరియాణా సరిహద్దు ప్రాంతంలో హరియాణా పోలీసులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన సమయంలోనే రైతులు కంటి చూపు కోల్పోయారు. చాలా మంది రైతులకు ఎముకలు విరిగిపోయాయని, తలగాయాలతో ఆసుపత్రుల్లో చేరారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. శంభు, ఖనౌరి సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఘర్షణలు జరుగుతున్నాయి. పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ బల్బీర్ సింగ్ ప్రస్తుత ఉద్రిక్తతలపై స్పందించారు.


ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో మోహరించిన పారామిలటరీ బలగాలు ఆందోళన చేస్తున్న తమను రెచ్చగొడుతున్నాయని రైతులు ఆరోపించారు. గురువారం కేంద్రంతో తమ చర్చల సందర్భంగా రైతు సంఘాల నాయకులు ప్రస్తుత పరిస్థితిని మంత్రులకు వివరించారు. రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ మాట్లాడుతూ.. తామేమీ పాకిస్థానీలం కాదని, సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారని అన్నారు. 


Also Read: Paytm Crisis: పేటీఎమ్‌కి మరో షాక్, ఫాస్టాగ్ జారీ నిలిపివేస్తూ IHMCL సంచలన నిర్ణయం