Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టు (Mumbai Airport)లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వీల్ చైర్ (Wheelchair) లేక ఓ 80 ఏళ్ల వృద్ధుడు  గ్రౌండ్ నుంచి ఇమిగ్రేషన్ కౌంటర్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి మృత్యువాత పడ్డాడు. వివరాలు.. న్యూయార్క్ (New York) నుంచి ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) ఒకటి ముంబై ఎయిర్‌పోర్టు (Mumbai Airport) చేరుకుంది. అందులో ఓ వృద్ధ జంట వీల్ చైర్ సదుపాయం ఉన్న టికెట్లతో ముంబై చేరుకున్నారు. అయితే అక్కడ వీల్ చైర్‌లు తక్కువగా ఉండడంతో ఒక దానిని మాత్రమే కేటాయించారు. దాంట్లో వృద్ధురాలు కూర్చోగా, ఆమె భర్త నడిచి సుమారు 1.5 కిలోమీటర్లు నడిచి ఇమిగ్రేషన్ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. 


అక్కడికి రాగానే నడుచుకుంటూ వచ్చిన వృద్ధుడు ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే ముంబై ఎయిర్‌పోర్టు వైద్య సదుపాయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి నానావతి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందారు. మృతుడు భారతీయ సంతతికి చెందినవారు. ఆయనకు యూఎస్ పాస్‌పోర్ట్ ఉంది. దంపతులు ఇద్దరూ ఎకానమీలో టికెట్‌తో పాటు వీల్ చైర్ సదుపాయాన్ని ముందుగా బుక్ చేసుకున్నారు.


ఎయిర్ ఇండియాకు చెందిన AI-116 విమానం ఆదివారం న్యూయార్క్ నుంచి ముంబై బయల్దేరింది. మూడు గంటలు ఆలస్యంగా సోమవారం మధ్యాహ్నం 2.10కి ముంబైలో ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానంలో 32 మంది వీల్‌చైర్ ప్రయాణికులు ఉన్నారు. అయితే 15 వీల్‌చైర్‌లతో సిబ్బంది వారికి సహాయం చేయడానికి మైదానంలో వేచి ఉన్నారు. వీల్‌చైర్‌లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో వృద్ధులను కొద్ది సేపు వేచి ఉండమని విమానయాన సిబ్బంది చెప్పారు. కానీ వృద్ధుడు తన జీవిత భాగస్వామితో కలిసి నడవడానికి నిర్ణయించుకున్నారని దాని కారణంగానే మరణం సంభవించిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.


ఇది దురదృష్టకర ఘటన అని, బాధిత కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఘటనపై గ్రౌండ్ సిబ్బంది స్పందిస్తూ.. వృద్ధ జంటలు జీవిత భాగస్వామిని విడిచిపెట్టి విమానం నుంచి టెర్మినల్‌కు వెళ్లడానికి ఇష్టపడరని, మొబిలిటీ సమస్యలు, వినికిడి సమస్యలు ఉన్నవారు ఒకరితో ఒకరు ఉండేందుకు ఇష్టపడతారని చెప్పారు. ఒక దశాబ్దం క్రితం వరకు ఎయిర్ ఇండియాతో సహా ఎయిర్‌లైన్స్ వీల్‌చైర్ సదుపాయం కోసం ఛార్జీ విధించాయి. మెడికల్ సర్టిఫికేట్ ఉన్నవారికి మాత్రమే ఉచితంగా వీల్‌చైర్ అందించబడ్డాయి. అయితే వివిధ వర్గాల నుంచి ఒత్తిడి కారణంగా ఎయిర్‌లైన్స్ మెడికల్ సర్టిఫికేట్ అవసరాన్ని తొలగించాయి.