Nutriaide App To Keep Your Diet In Check : మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాలు తీసుకుంటే ఎన్ని క్యాలరీలు ఉంటాయో అన్న విషయాన్ని పోషకాహార నిపుణులు చెబితేగానీ తెలియదు. పోషకాహార నిపుణులు చెప్పే లెక్క ప్రకారం ఆహారాన్ని తీసుకుంటే రోజువారీ క్యాలరీల లెక్కపై అవగాహన వస్తుంది. మనం తినే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో, పోషకాలు ఎన్నో..? చక్కెర ఎంత శాతమో ఒక్క క్లిక్‌తో తెలుసుకునే సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్). న్యూట్రీ ఎయిడ్ పేరుతో తీసుకువచ్చిన ఈ యాప్‌లో ఆ ఆహారం ఫొటోను అప్‌లోడ్ చేస్తే వెంటనే ఈ వివరాలన్నీ అందులో తెలుస్తాయి. దీనివల్ల ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. ఈ యాప్ ద్వారా ఆహారపు అలవాట్లలో విప్లవాత్మకమైన మార్పులకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
యాప్‌ను రూపొందించిన నిపుణుల బృందం
జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) డైరక్టర్ డాక్టర్ ఆర్ హేమలత, జర్మనీకి చెందిన ఆగస్ బర్గ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మార్కస్ కెక్ ఈ యాప్‌ను తార్నాకలోని ఎన్‌ఐఏ కార్యాలయంలో ప్రారంభించారు. జర్మనీ సహకారంతో రెండేళ్లపాటు శ్రమించి ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తల బృందం ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఆహారపు అలవాట్లలో చెడు, మంచిని గుర్తించడంతోపాటు మంచి ఆహారపు అలవాట్ల పెంపొందించుకునేందుకు యాప్ శాస్ర్తీయమైన సూచనలను చేసేలా అభివృద్ధి చేశారు. తీసుకునే ఆహారాన్ని యాప్‌తో స్కాన్ చేస్తే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ సహకారంతో ఆహారంలోని పోషక విలువలను క్షణాల్లో తెలియజేస్తుంది. ఇందుకోసం యాప్‌లో ప్రత్యేక టూల్‌ను పొందుపరిచారు. సూక్ష్మ, స్థూల పోషకాలు, కర్భన ఉద్ఘారాలు వంటి వివరాలను ఈ యాప్ స్పష్టంగా తెలియజేస్తుంది. యాప్‌ను అభివృద్ధి చేసే క్రమంలో హైదరాబాద్‌లోని 720 మంది ఆహారపు అలవాట్లు ఆధారంగా మొదటి పైలెట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టారు. ఆ తరువాత రెండో దశలో ప్రజలందరి ఆహారపు అలవాట్లు, ఎలాంటి పోషకాహారం తీసుకోవాలనే వివరాలతో సమగ్ర యాప్‌ను అభివృద్ధి చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం
ఈ యాప్ వల్ల శరీరానికి అవసరమైన సమతుల ఆహారాన్ని ప్రతిరోజూ సులభంగా తీసుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ చేసే వ్యక్తులు తమ రోజువారీ ఆహారంలో ఉండాల్సిన విటమిన్లు, పోషకాలు వంటి వివరాలను ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలు వారీగా ఉన్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా న్యూట్రీ ఎయిడ్ యాప్‌ను అభివృద్ధి చేయడం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. యాప్‌లో సుమారు 5 వేలకుపైగా ఆహార పదార్థాలకు సంబంధించిన డేటాను పొందుపరిచారు. ఆయా ఆహార పదార్థాలకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేయగానే వివరాలు తెలుస్తుంది. ఇది ఒకరకంగా పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకునేలా ప్రజల్లో విస్తృతమైన అవగాహనను పెంపొందించేందుకు దోహదం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.