NCP President Sharad Pawar:


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ రాజీనామా మహారాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచింది. సుప్రియా సూలే ఆ పదవీ బాధ్యతలు తీసుకుంటారని భావించినా అది జరగలేదు. అయితే పార్టీ కోర్ కమిటీ మాత్రం శరద్ పవార్‌ రాజీనామాను ఖండించింది. ఆయన రాజీనామాను తిరస్కరించింది. అంతే కాదు. చీఫ్ పదవిలోనే కొనసాగాలని పవార్‌కు రిక్వెస్ట్ కూడా పెట్టుకుంది. కమిటీ సభ్యులో తదుపరి అధినేత ఎవరో నిర్ణయిస్తారని పవార్ చెబుతూ వచ్చారు. అయితే..కమిటీ మాత్రం ఆయన నిర్ణయాన్ని అంగీకరించడం లేదు.


కచ్చితంగా అదే పదవిలో కొనసాగాలని పట్టుపడుతోంది. ఫలితంగా పవార్‌కు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. మళ్లీ ఎన్‌సీపీ పగ్గాలు ఆయన చేతికే దక్కాయి. దీనిపై పార్టీ లీడర్ ప్రఫుల్ పటేల్ స్పందించారు. పార్టీలో పవార్‌కు ప్రత్యామ్నాయంగా మరో నేత లేరే లేరని స్పష్టం చేశారు. అందుకే ఆయననే ఆ పదవిలో కొనసాగాలని సూచించినట్టు చెప్పారు. అంతే కాదు. పార్టీ నేతలంతా కలిసి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. 


"శరద్ పవార్ మే 2వ తేదీన ఉన్నట్టుండి రాజీనామా చేశారు. మేం చాలా షాక్‌కు గురయ్యాం. మా పార్టీ నేతలంతా ఆశ్చర్యపోయారు. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని భావించాం. అందుకే కొంత మంతి కలిసి కమిటీ ఏర్పాటు చేశాం. తదుపరి కార్యాచరణపై చర్చించాం. చివరకు ఓ నిర్ణయానికొచ్చాం. ఆయన రాజీనామాను అంగీకరించకూడదని భావించాం. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయన రాజీనామా చేశారు. అందుకే ఇవాళ ఆయనతో భేటీ అయ్యాం. కచ్చితంగా పదవిలోనే ఉండాలని డిమాండ్ చేశాం. మా  మాటను ఆయన కాదనలేకపోయారు. ఏకగ్రీవంగా ఆయననే మళ్లీ ఎన్నుకున్నాం. పార్టీ ప్రెసిడెంట్‌గా ఆయనే ఉంటారు"


- ప్రఫుల్ పటేల్, ఎన్‌సీపీ నేత 


దేశంలో పవర్‌ఫుల్‌ లీడర్స్‌లో పవార్ ఒకరని ప్రశంసించిన ప్రఫుల్ పటేల్...పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అవసరం లేదని తేల్చి చెప్పారు. పవార్ ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని వెల్లడించారు. 


"పవార్‌ పవర్‌ఫుల్ లీడర్. అలాంటి వ్యక్తి పార్టీ ప్రెసిడెన్సీ నుంచి తప్పుకోడం సరికాదు. అందుకే మేమంతా రిక్వెస్ట్ చేసి మరీ ఆయనను మళ్లీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నాం. పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. సుప్రియా సూలే ప్రెసిడెన్సీపై ప్రస్తుతానికి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. పార్టీ అధిష్ఠానం ఎలా చెబితే అలా నడుచుకుంటాం. ప్రస్తుతానికి మాత్రం పవార్ మా ప్రెసిడెంట్. "


- ప్రఫుల్ పటేల్, ఎన్‌సీపీ నేత  


Also Read: Morena Firing: మధ్యప్రదేశ్‌లో కాల్పులు, స్థల వివాదంలో ఘర్షణ - ఆరుగురు మృతి