ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ హింసాత్మక ఘటన, తన అరెస్ట్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఏబీపీ న్యూస్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం, యోగి సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ హింసాత్మక ఘటనలో నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. కానీ నన్ను వెంటనే అరెస్ట్ చేశారు. అఖిలేశ్ యాదవ్ జీ ని గృహ నిర్బంధంలో ఉంచారు. చన్నీ జీ, బఘేల్ జీ.. యూపీ రావాలనుకుంటే వారిని కూడా అడ్డుకున్నారు. - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
తన కుమారుడు ఆశిష్‌కు ఈ ఘటనకు ఎలాంచి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ తప్పుబట్టారు.
ఒక తండ్రి తన కొడుకును రక్షించాలనే అనుకుంటారు. కానీ ఇక్కడ రుజువులు ఉన్నాయి. వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈ ఘటనకు సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. మా పార్టీ కార్యకర్తలు.. రైతులతో మాట్లాడి.. అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా తెలుసుకున్నారు. - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
అయితే తాను నిరాహార దీక్ష చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ప్రియాంక గాంధీ ఖండించారు. ఎలాంటి వారెంట్ చూపించకుండా తనను ఇక్కడ నిర్బంధంలో ఉంచినట్లు ప్రియాంక వెల్లడించారు.
పోలీసులు.. అయితే నన్ను అరెస్ట్ చేయాలి లేకపోతే వదిలేయాలి. నన్ను విడిచిపెట్టిన తర్వాత కచ్చితంగా లఖింపుర్ వెళ్లి తీరతాను. నేను ఒక రాజకీయ నాయకురాలిని. బాధితులను పరామర్శించడం నా బాధ్యత. ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. భాజపా వాళ్లు రాజకీయం చేస్తే దానిని జాతీయతగా అభివర్ణించుకుంటారు. కానీ ప్రతిపక్షాలు బాధితులను చూడటానికి వెళ్తే అది రాజకీయం అవుతుందా? వాళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే మేం చేతులు కట్టుకొని కూర్చోవాలా? - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
గది శుభ్రం..
ప్రియాంక గాంధీని నిర్బంధించిన గది శుభ్రంగా లేకపోయేసరికి.. ఆమె స్వయంగా చీపురుపట్టి ఊడ్చారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ ఘటనతో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను ప్రియాంక క్లీన్ స్వీప్ చేస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి