Priyanka Gandhi: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్‌ యాత్ర త్వరలోనే యూపీలో ప్రవేశించనుంది. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు పాల్గొంటున్నారు ప్రియాంక. అయితే...అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటానని X వేదికగా వెల్లడించారు. 


"యూపీలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. కానీ అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. కాస్త నయం అయిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటాను. ఈలోగా యూపీలోకి యాత్ర కోసం అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. రాహుల్ గాంధీకి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను"


- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


 






భారత్ జోడో న్యాయ్ యాత్ర


ఇవాళ (ఫిబ్రవరి 16వ తేదీన) భారత్ జోడో న్యాయ్ యాత్ర వారణాసికి చేరుకుంది. ఫిబ్రవరి 19వ తేదీ నాటికి అమేథీకి చేరుకోనుంది. అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలోనే రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ మరుసటి రోజు ఈ యాత్ర రాయ్‌బరేలీకి చేరుకుటుందని కాంగ్రెస్ వెల్లడించింది. అక్కడి నుంచి లక్నోకి వెళ్లి రాత్రి అక్కడే బస చేయనున్నారు రాహుల్ గాంధీ. యూపీలో కాంగ్రెస్ పరిధిలో ఉన్న ఒకే ఒక లోక్‌సభ నియోజకవర్గం రాయ్‌బరేలి మాత్రమే. ప్రస్తుతం సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ...స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. నెహ్రూ, గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథిలోనే రాహుల్ ఓడిపోవడం వల్ల ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఇక భారత్ జోడో న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 21 నాటికి ఉన్నావ్‌కి చేరుకోనుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకూ యూపీలోనే ఈ యాత్ర కొనసాగుతుంది.


తమ బ్యాంక్ అకౌంట్‌లన్నీ ఫ్రీజ్ అయిపోయాయంటూ కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. పార్టీకి సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోయాయని వెల్లడించింది. వీటిలో Youth Congress అకౌంట్‌ కూడా ఉందని తెలిపింది. ఐటీ డిపార్ట్‌మెంట్ ఈ ఖాతాల్ని నిలిపివేసిందని స్పష్టం చేసింది. పార్టీ ప్రతినిధి అజయ్ మకేన్ ఈ విషయం వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారంటూ మండి పడ్డారు. అకౌంట్‌లు ఫ్రీజ్ చేయడమే కాకుండా రూ.210 కోట్ల పన్ను కట్టాలని ఐటీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఇది రాజకీయ కక్షేనని ఆరోపించింది. కావాలనే కుట్రపూరితంగా ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయింది. కేవలం ఒకటే పార్టీ మొత్తం దేశాన్ని నియంత్రిస్తోంది. ప్రతిపక్షాన్ని పూర్తిగా అణిచివేస్తున్నారు. దీనిపై మాకు న్యాయం జరగాల్సిందే. మీడియాతో పాటు ప్రజల్నీ మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం"


- అజయ్ మకేన్, కాంగ్రెస్ ప్రతినిధి