Priyanka Gandhi slams PM Modi:
ఓ సదస్సులో వ్యాఖ్యలు..
ప్రధాని నరేంద్ర మోదీ ఓ మీడియా సదస్సులో ఆత్మహత్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సూసైడ్ నోట్‌పై ఆయన ఓ జోక్ చెప్పడంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. "ఆత్మహత్యలంటే మరీ అంత జోక్‌గా ఉందా.." అంటూ ప్రశ్నిస్తున్నాయి. మెంటల్ హెల్త్ విషయంలో అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తేల్చి చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా మోదీపై విమర్శలు చేశారు. డిప్రెషన్, సూసైడ్‌లు చాలా సీరియస్ అంశాలని, వాటిపై జోక్‌లు వేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఒత్తిడి, ఆత్మహత్యలు..ఈ రెండు అంశాలూ చాలా తీవ్రంగా పరిగణించాల్సినవి. వీటిపైన జోక్‌లు వేయడమేంటి..? NCRB డేటా ప్రకారం 2021లో లక్షా 64 వేల మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వాళ్లే. ఇది చాలా విషాదకరమైన విషయం. దీన్ని మీరు జోక్‌గా తీసుకుంటున్నారు. పైగా ఆ జోక్ చెప్పి మీరే గట్టిగా నవ్వుతున్నారు. మెంటల్ హెల్త్ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సింది పోయి ఇలా చేస్తారా..?"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
ఇంతకీ మోదీ ఏం అన్నారు..?
ఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఓ చిన్న కథ చెప్పారు.
"ఓ ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఓ సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయింది. నాకు బతకాలని లేదు. చనిపోతాను. ఈ జీవితంతో నేను పోరాడలేను అని ఆ నోట్‌లో రాసింది. ఉదయం నిద్ర లేచి చూసే సరికి తన కూతురు కనిపించలేదు. ఆ ప్రొఫెసర్ చాలా కంగారు పడిపోయాడు. అప్పుడే ఆ అమ్మాయి గదిలో ఓ నోట్ దొరికింది. అది చూసి ఆయనకు చాలా కోపం వచ్చింది. నేనో ప్రొఫెసర్‌ని. ఎంతో మందికి పాఠాలు చెప్పాను. అయినా నా కూతురు Conquer స్పెలింగ్ తప్పుగా రాసిందని ఆయన మండి పడ్డాడు"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదిగో ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే హాల్‌లోని అందరూ గట్టిగా నవ్వారు. చప్పట్లు కొట్టారు. మోదీ కూడా నవ్వారు. ఈ వీడియోని షేర్ చేస్తున్న విపక్ష పార్టీల నేతలు మోదీపై విరుచుకు పడుతున్నారు. సూసైడ్ లాంటి సీరియస్ ఇష్యూ ఇలాంటి జోక్‌లు వేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు.