Prime Minister Modi took a class for BJP MPs from Telugu states:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్  బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహార విందు ఇచ్చారు.  పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రాల్లో పార్టీ  పరిస్థితి, ప్రతిపక్ష పాత్ర వంటి వాటిపై మాట్లాడారు.   ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రశంసించారు.  వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలకు బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని అడిగినట్లుగా చెబుతున్నారు.  తెలంగాణలో పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించకపోవడంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  గురువారం దిల్లీలో ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణ, అండమాన్ కు చెందిన 15 మంది ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. సుమారు అరగంట పాటు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల్లో పార్టీ పరిణామాలు, ప్రభుత్వ చర్యలు, రాజకీయ వ్యూహాలపై దృష్టి సారించారు. ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా  వస్తున్నాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి అవకాశమని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర పరిపాలనపై మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని, ఇది  బీజేపీకి  కూడా ప్రయోజకరమని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందన్నారు.   వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు భాజపా దీటుగా స్పందించాలని ఎంపీలకుప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్ర-రాష్ట్ర సహకారాలపై వైసీపీ చేస్తున్న దాడులకు పార్టీ నేతలు, ఎంపీలు సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ విషయంపై   ఎంపీలు, నేతలు మరింత యాక్టివ్‌గా ఉండాలని మోదీ హైలైట్ చేశారు.

Continues below advertisement

తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై విమర్శలు

తెలంగాణలో  బీజేపీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడం లేదని, మంచి టీమ్ ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదుర్కొనే అంశాలను హైలైట్ చేయడంలో, పార్టీ గ్రాఫ్‌ను పెంచుకోవడంలో ఎంపీలు, నేతలు సీరియస్ గా పని చేయడం లేదని  ఆయన విమర్శించారు. తెలంగాణలో  మంచి అవకాశాలు ఉన్నా, వాటిని ఉపయోగించుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని మోదీ పేర్కొన్నారు.   తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ పరిణామాలపై మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి, కేంద్ర ప్రభుత్వ చర్యలు, జాతీయ సంకల్పాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. ‘వికసిత భారత్’, ‘అమృత్ కాలం’ వంటి కార్యక్రమాలపై ఎంపీలు ప్రచారం చేయాలని, ఇతర రాష్ట్రాల్లో భాజపా బలోపేతానికి కృషి చేయాలని మోదీ చెప్పారు. అండమాన్ ఎంపీలపై  ఆయన సానుకూల వ్యాఖ్యలు చేశారు.                                 

Continues below advertisement