నన్ను సంప్రదించి ఉండాల్సింది: మమతా బెనర్జీ


ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ఎంపిక చేసినప్పటి నుంచి నిత్యం ఇదే విషయంపై రాజకీయంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అటు ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగనున్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా రోజుల పాటు మేధోమథనం కొనసాగింది. ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించారు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ. అయితే మమతా బెనర్జీ ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. భాజపా తనను సంప్రదించి, గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా
నిలబెడుతున్నామని చెప్పి ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చేదాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ విషయంలో ఓసారైనా ఎన్‌డీఏ తనతో చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు మమతా. పైగా ద్రౌపది ముర్ముని బరిలోకి దింపటం వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో వేడి పెరిగిందని వెల్లడించారు. 


యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు..


ప్రస్తుతానికి యశ్వంత్ సిన్హాకు పూర్తి స్థాయి మద్దతుని కొనసాగిస్తామని స్పష్టం చేశారు మమతా బెనర్జీ. "జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ప్రతి పక్షాల నిర్ణయాన్ని గౌరవిస్తూ యశ్వంత్ సిన్హాకు మద్దతునిస్తున్నాను" అని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాను కోరుకుంటున్నట్టు మమతా బెనర్జీ తెలిపారు. అటల్‌ బిహారీ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హాను ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి ప్రతిపక్షాలు. 2018లో భాజపాను వీడిన యశ్వంత్ సిన్హా, గతేడాది మార్చ్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. మూడు రోజుల తరవాత అంటే..జులై 21న ఫలితాలు వెల్లడిస్తారు. జులై 24వ తేదీ నాటికి ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. భారత రాజ్యాంగం ప్రకారం, ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే
మరో రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. 776 ఎంపీలు, 4,033మంది ఎమ్‌ఎల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ రాష్ట్రపతినిఎన్నుకుంటుంది. 
నామినేటెడ్ ఎంపీలు, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు ఓటు వేసేందుకు వీల్లేదు. 


మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్‌ లాంటి రాష్ట్రాల్లో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ మద్దతు కూడగట్టవచ్చని ప్లాన్ చేసింది భాజపా. ఈ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనుండటం వల్ల ఇక్కడ పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది కాషాయ పార్టీ. ఏదేమైనా ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. 


Also Read: Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?


Also Read: Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి