Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. దాదాపు 20 రోజుల తరవాత ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఈ వార్త తెలియగానే ఎంతో ఆందోళన చెందానని వెల్లడించారు. ఏ నాగరిక సమాజమూ ఇంత దారుణమైన హింసను ఉపేక్షించదని తేల్చి చెప్పారు. ఇక్కడితో ఇలాంటి అమానుషాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ఇంత మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నా..నేరస్థులు ఎక్కడో ఓ చోట స్వేచ్ఛగా విహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. PTI కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు. మహిళలపై అత్యాచార ఘటనల్ని అంతా కలిసి చాలా తొందరగా మరిచిపోతున్నారని, అప్పటి వరకే మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఈ కారణంగానే నేరాలు ఇంకా పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. 


"ఇలాంటి దారుణాలను ఈ నాగరిక సమాజం అంగీకరించదు. 2012లో నిర్భయ ఘటన జరిగింది. ఇప్పటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి అత్యాచార ఘటనలు ఏం జరిగినా కొద్ది రోజుల్లోనే అంతా మరిచిపోతున్నారు. మహిళలపై ఈ తరహా హింసను కచ్చితంగా ఖండించాల్సిందే. ఇంత మంది విద్యార్థులు, వైద్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అటు నేరస్థులు మాత్రం చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు."


- ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి 






నేరుగా కాకపోయినా పరోక్షంగా మరి కొన్ని ఘటనలనూ ప్రస్తావించారు ద్రౌపది ముర్ము. ఉత్తరాఖండ్‌, మహారాష్ట్రలో జరిగిన అత్యాచార ఘటనలపై అసహనం వ్యక్తం చేశారు. మలయాళ ఇండస్ట్రీలో వస్తున్న ఆరోపణలపైనా పరోక్షంగా మాట్లాడారు. ఏ మాత్రం ఆలోచనా శక్తి లేని వాళ్లే మహిళల్ని తక్కువ చేసి చూస్తారని అన్నారు. ఈ విషయంలో సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆగస్టు 9వ తేదీన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైంది. ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఓ జూనియర్ డాక్టర్‌ అందరికీ సమాచారం ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పలు చోట్ల వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిందితుడిని ఉరి తీయాలంటూ నినదిస్తున్నారు.


ప్రస్తుతానికి సీబీఐ ఈ కేసుని విచారిస్తోంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు సంజయ్ రాయ్‌కి అధికారులు లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. అంతకు ముందు మరో ఐదుగురికి ఇదే పరీక్ష చేశారు. వీళ్లందరు చెప్పిన విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై విచారించేందుకు ప్రత్యేకంగా సిట్‌ని నియమించింది. ఇప్పటికే ఈ కమిటీ ఓ రిపోర్ట్‌ని అందించింది. అటు సీబీఐ కూడా సుప్రీంకోర్టులో ఓ రిపోర్ట్‌ సమర్పించింది. ఇది సామూహిక అత్యాచారం కాదని, ఒక్కడే నిందితుడు ఈ పని చేశాడని వెల్లడించింది. 


Also Read: Viral Video: డైరెక్టర్ ఇంట్లోకి చొరబడిన దొంగ, పెంపుడు పిల్లి అరుపులతో అంతా అలెర్ట్ - వీడియో