Sikkim CM Oath Ceremony: సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM) అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రి కావడం ఇది వరుసగా రెండోసారి. సిక్కింలోని పాల్జోర్ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య తమాంగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.


32 స్థానాలకు 31 గెలుచుకున్న ఎస్కేఎం
ఈ ఏడాది ఏప్రిల్‌లో సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, జూన్ 2న ఫలితాలు వచ్చాయి. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారీ మోర్చా రాష్ట్రంలోని 32 స్థానాలకు గాను 31 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమాంగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. సోరెంగ్‌-చకుంగ్‌, రెనాక్‌ స్థానాలను గెలవడం ద్వారా తమాంగ్‌కు ప్రజల్లో గట్టి పట్టు ఉందని మరోసారి నిరూపించుకున్నారు.


రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ప్రేమ్ సింగ్ తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న పశ్చిమ సిక్కింలోని సింగిల్ బస్తీలో జన్మించారు. అతని తండ్రి పేరు కాలు సింగ్ తమాంగ్, తల్లి పేరు ధన్ మాయా తమాంగ్. తన ప్రారంభ విద్యను పూర్తి చేసిన తర్వాత, తమాంగ్ 1988లో డార్జిలింగ్ ప్రభుత్వ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టాని పొందాడు. రాజకీయాల్లోకి రాకముందు తమాంగ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అయితే టీచర్‌గా పని చేయకుండా సామాజిక సేవపై ఎక్కువ ఆసక్తి చూపారు. ఈ కారణంగా అతను తరువాత సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF)  రాజకీయ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు.  నెమ్మదిగా పార్టీ సభ్యుడిగా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎస్‌డిఎఫ్‌లో శాశ్వత సభ్యుడిగా మారారు. చామ్లింగ్  సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్‌ను తన రాజకీయ గురువుగా భావించారు.


1994లో సోరెంగ్ చకుంగ్ స్థానం నుంచి తొలిసారి గెలుపు
1994లో తమాంగ్ తన జీవితంలో మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అతను  సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ టిక్కెట్‌పై సోరెంగ్ చకుంగ్ స్థానం నుండి పోటీ చేసి తన మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. 1994 నుండి 1999 వరకు అతను పశుసంవర్ధక, చర్చి,  పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సోరెంగ్ చకుంగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 వరకు రాష్ట్ర పరిశ్రమలు, పశుసంవర్థక శాఖ మంత్రిగా పనిచేశారు. తదుపరి ఎన్నికల్లో అంటే 2004లో చకుంగ్ నియోజకవర్గం నుంచి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ మోహన్ ప్రధాన్‌పై విజయం సాధించారు. దీంతో రాష్ట్ర భవన, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో ప్రేమ్ సింగ్ తమాంగ్ అప్పర్ బర్తుక్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ కుమార్ రాయ్‌పై విజయం సాధించారు.


 2013లో  సిక్కిం క్రాంతికారి మోర్చా
2013 సంవత్సరంలో ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎస్డీఎఫ్ నుండి రాజీనామా చేసిన తర్వాత, రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) అనే కొత్త పార్టీని స్థాపించారు. తమాంగ్ పార్టీని స్థాపించి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ కాలంలో రాష్ట్రంలోని 32 స్థానాలకు గాను సిక్కిం క్రాంతికారి మోర్చా 10 స్థానాలను గెలుచుకుంది. 43 శాతం ఓటింగ్ శాతంతో రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చాకి  శుభారంభం లభించింది.


2019లో అధికారం 
  2019 సంవత్సరంలో తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా రాష్ట్రంలో మొదటిసారి గెలిచింది. 24 ఏళ్ల ఐదు నెలల 15 రోజుల పాటు అధికారంలో ఉన్న పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసింది. సిక్కిం క్రాంతికారి మోర్చా 17 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో పవన్ కుమార్ చామ్లింగ్ ప్రభుత్వం పడిపోయి..  ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రభుత్వం ఆవిర్భవించింది.