PM Modi Cabinet Meeting: మోదీ కేబినెట్ 3.0 తొలి భేటీలో ప్రధాని ఆవాస్ యోజన పథకం అమలు గురించి కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇలా నిర్మించే కొత్త ఇళ్లకు ఎల్‌పీజీ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్లు వంటి సదుపాయాలను కూడా కల్పించాలని నిర్ణయించారు. బీజేపీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా మొదటి హామీ నెరవేర్చే దిశగా మోదీ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 10 ఏళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో సుమారు 4.21 కోట్ల ఇళ్లు నిర్మించినట్లుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.


సోమవారం (జూన్ 10) మధ్యాహ్నం దాటాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కొత్త మంత్రివర్గంతో సమావేశం అయ్యారు. కొత్త మంత్రి వర్గం ఏర్పాటు అయ్యాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. 100 రోజుల ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు వివరాలను కూడా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ కేబినెట్‌లో చేరిన మంత్రులకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొనగా మొత్తానికి వారి శాఖల వివరాలను బయటపెట్టేశారు. ఇప్పటికే ఆర్థిక, రక్షణ, హోం, రైల్వే వంటి కీలక శాఖలు బీజేపీకి చెందిన ఎంపీలకే ఉంటాయని స్పష్టం చేశారు. 


ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు మోదీ కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ (బీజేపీ) భూపతిరాజు శ్రీనివాస వర్మను మోదీ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. రైల్వే, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి లేదా ఆరోగ్య, జలశక్తి మంత్రిత్వ శాఖల్లో ఏవైనా తమకు ఇవ్వాలని మోదీ, అమిత్ షాలను ఇప్పటికే చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. కానీ, ఆ శాఖలను తెలుగు ఎంపీలకు కేటాయించలేదు.


Also Read: మోదీ 3.0 కేబినెట్‌లో కొత్త మంత్రులకు శాఖలు ఇవే, పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి


పట్టణాభివృద్ధి శాఖ ద్వారా రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా అనుకున్న సమయానికి పూర్తి చేయవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమర్థంగా పూర్తి కావాలంటే.. జలశక్తి శాఖ అయితే బావుంటుందని చంద్రబాబు కోరినట్లుగా కూడా తెలిసింది. కానీ, ఏపీ, తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లిన మంత్రులకు నామమాత్రంపు శాఖలు కేటాయించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


Also Read: మోదీ 3.0 కేబినెట్‌లో కొత్త మంత్రులకు శాఖలు ఇవే, పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి