ఢిల్లీ రాజకీయాలు కొన్ని రోజుల నుంచి వేగంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది నిర్వహించనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటికే ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఈ క్రమంలో రాజకీయ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడంతో హస్తిన రాజకీయాలు మరింత వేడెక్కాయి. పీకే కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు ఊహగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ అనంతరం కాంగ్రెస్‌లో చేరికపై ఇంతవరకూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం అయినట్లు పేర్కొంటున్నాయి.


సీనియర్లతో సమావేశం..


ప్రశాంత్ కిషోర్ తమ పార్టీలో చేరిక అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం వారం క్రితం రాహుల్ గాంధీ అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కమల్‌నాథ్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ, హరీష్ రావత్, అంబికా సోని, కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గురించి చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లోకి చేరితేనే పార్టీకి లాభిస్తుందని సీనియర్ నేతలు రాహుల్ గాంధీతో చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.


పీకేకు కీలక పదవి..




కాంగ్రెస్‌ పార్టీలో పీకేకు ఎలాంటి స్థానం కల్పించాలనే విషయమై అధిష్టానం, నేతల మధ్య అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆయన వస్తే కలిగే లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను పార్టీలోకి తీసుకునే ముందు సీనియర్లతో చర్చించాలని రాహుల్‌కు తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు. బీజేపీని ఓడించేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన కొన్ని సూచనలపై కాంగ్రెస్ సీనియర్లు కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా కనీసం 136 సీట్లను గెలవాల్సి ఉంటుందని, ఇతర పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, అన్ని పార్టీలు ఏకం కావడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన శరద్‌ పవార్‌, లాలూ ప్రసాద్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ తదితరులతో భేటీ అయ్యారు.


ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల గురించి, కాంగ్రెస్ ప్రణాళికలపై వారు చర్చించినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి రేసులో శరద్ పవార్ ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో పవార్ భేటీ కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.