తనపై అబద్ధపు ప్రచారానికి పాల్పడుతున్నారంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేశారు. తన భర్త పోర్న్ వీడియోల కేసు వ్యవహారంలో చిక్కుకొని పోలీస్ కస్టడీలో ఉండగా.. మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇదే వ్యవహారానికి సంబంధించి శిల్ప కోర్టుని ఆశ్రయించడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. తన మీద కొన్ని మీడియా వర్గాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని.. దీనికి సంబంధించి 29 మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువు నష్టం దావా వేశారు.
పోర్న్ వీడియోల వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లుగా సదరు మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని నటి శిల్పాశెట్టి ఫిర్యాదు చేశారు. పోర్న్ వీడియోల వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తన పరువు తీసేలా కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేస్తున్నాయని శిల్పాశెట్టి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓ వైపు పోలీసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి ప్రచారాలు తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న మొత్తం 29 మీడియా సంస్థలపై ఆమె ఫిర్యాదు చేశారు. సదరు మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని.. ఇప్పటివరకు ప్రచురించిన కథనాలను సైతం డిలీట్ చేయించి.. తనకు క్షమాపణలు చెప్పించాలని కోర్టుని శిల్పాశెట్టి కోరారు. తన పరువుకు భంగం కలిగిచినందుకు గాను రూ.25 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆమె కోరారు.
శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఎప్పుడైతే పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యారో అప్పటినుండి నటిపై కూడా మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. రాజ్ కుంద్రా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని.. శిల్పాశెట్టి కారణంగానే ఆయనకు సినీ జనాలతో పరిచయాలు ఏర్పడ్డాయని.. ఆమెకి తెలియకుండా ఈ పోర్న్ బిజినెస్ జరిగే ఛాన్సే లేదని కొన్ని వార్తలు వచ్చాయి. శిల్పాశెట్టి సహకారంతోనే రాజ్ కుంద్రా తన వ్యాపారం నిర్వహిస్తున్నారని సైతం కథనాలు వచ్చాయి.
పైగా రాజ్ కుంద్రా కంపెనీలో శిల్పాశెట్టి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించడంతో కచ్చితంగా ఆమె ప్రమేయం ఉండే ఉంటుందని.. ఈ కేసు విషయంలో ఆమెని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ గట్టిగానే ప్రచారం జరిగింది. ఈ కేసు విషయంలో శిల్పను పోలీసులు విచారించారే గానీ అరెస్ట్ మాత్రం చేయలేదు. అయినప్పటికీ మీడియాలో ఆమెపై నెగెటివ్ ప్రచారం ఆగలేదు. తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా శిల్పాశెట్టి మీడియా సంస్థలపై కౌంటర్ పిటిషన్ వేశారు.