Prashant Kishor For Vijay: తమిళనాడు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ సంచలనంగా మారుతున్నారు. ఆయన విజయ్ పార్టీ కోసం పని చేస్తున్నట్లుగా ప్రకటించారు. టీవీకే పార్టీ సమావేశానికి హాజరైన ఆయన..  ధోనీ CSKని గెలిపించినట్టు నేను TVKని గెలిపిస్తానని చాలెంజ్ చేశారు.  విజయ్ (TVK)పార్టీని గెలిపిస్తే ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ తమిళనాడులో వస్తుందని  ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. తమిళం నేర్చుకుని వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల తర్వాత విజయ్ పార్టీ విజయోత్సవంలో తమిళంలో మాట్లాడతానని ప్రకటించారు. విజయ్ తో మాట్లాడినప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి నిబద్ధతతో ఉన్నాడని తెలుసుకున్నానని పీకే చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకు వచ్చేలా ఆయన ఆలోచనలు ఉన్నాయన్నారు. తమిళనాడు విజయ్ ఓ కొత్త హోప్ అని ఆయన అభివర్ణించారు. 

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో  డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేశారు.  ఆ తర్వాత ఆయన  బీహార్ లో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయం  చేసుకుంటున్నారు. అయితే తనను సంప్రదించే రాజకీయ నేతలకు సలహాలు మాత్రం ఇస్తున్నారు. డీఎంకే పార్టీ ప్రశాంత్ కిషోర్ తో తర్వాత సంబంధాలు కొనసాగించలేదు. ఇప్పుడు విజయ్ సంప్రదించడంతో ఆయనతో పని చేసేందుకు రెడీ అయ్యారు. ఐ ప్యాక్ సంస్థ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేతుల్లో లేదు.  సంస్థ తరపున కాకుండా.. వ్యక్తిగతంగానే విజయ్ పార్టీకి పని చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. 

ప్రశాంత్ కిషోర్..  విజయ్ పార్టీ, అన్నాడీఎంకే పార్టీ మధ్య పొత్తును ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.  రెండు పార్టీలు కలిస్తే తప్ప డీఎంకేఓడించడం అసాధ్యమని చెప్పినట్లుగా తెలుస్తోంది. పైగా విడివిడిగా పోటీ చేస్తే డీఎంకేకు భారీ మెజారటీలు వస్తాయని విశ్లేషించినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ అన్నాడీఎంకే నాయకత్వంతోనూ చర్చించినట్లుగా చెబుతున్నారు. పట్టు విడుపులకు పోకుండా రెండు పార్టీలు కలిస్తే రాజకీయం హోరాహోరీగా మారుతుందన్న అంచనాలను వేస్తున్నారు. విజయ్ కూడా పొత్తులకు సిద్ధంగా ఉండటంతో.. ప్రశాంత్ కిషోర్ పని చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.  

విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత అన్నాడీఎంకేను పల్లెత్తు మాట అనలేదు. పూర్తిగా డీఎంకేనే టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో  అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో విజయ్ వ్యూహాత్మకంగానే ఉన్నారని అంటున్నారు. జయలలిత అభిమానులంతా ఏకపక్షంగా తన వైపే ఉంటే.. విజయం సునాయసం అవుతుందని  విజయ్ భావిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే.. తమిళనాడు రాజకీయాలు మరింత జోరందుకునే అవకాశం ఉంది. హిందీ కేంద్రంగా ప్రస్తుతం స్టాలిన్ రాజకీయాలు చేస్తున్నారు. తమిళుల్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

Also read: సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నో - రేప్ కేసు పెట్టిన యువతి - ప్రేమ వైఫల్యం నేరం కాదన్న కోర్టు !