Woman Consents To Intimacy: పెళ్లి చేసుకుంటానన్న అంగీకారంతోనే మహిళ శారీరక సంబంధానికి అంగీకరిస్తుందన్నది న్యాయసూత్రం కాదని ఒడిషా హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం చేసుకుంటానని తప్పుడు హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన ఒక మహిళ ఫిర్యాదుపై తనపై క్రిమినల్ చర్యలు ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై ఒడిషా హైకోర్టులో విచారణ జరిగింది. తాము సహజీవనం చాలా కాలం చేశామని అయితే తర్వాత తనను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని ఆ మహిళ కేసు పెట్టింది. ఇది భారత శిక్షాస్మృతి (IPC) ప్రకారం అత్యాచారానికి సమానమని ఆ మహిళ వాదించింది. ఆ మహిళతో సహజీవనం చేసిన వ్యక్తిపై IPC సెక్షన్లు 376(2)(a), 376(2)(i), 376(2)(n), 294, 506, 34 కింద కేసులు పెట్టారు.
ఏకాభిప్రాయంతో తాము సహజీవనం చేశామని ఆ వ్యక్తి కోర్టులో వాదించారు. ఆ మహిళ మేజర్ ్ని.. తెలివైనదని.. ఆమె ఏం చేస్తుందో ఆమెకు స్పష్టత ఉందని.. తెలిపారు. కుటుంబం నుండి వచ్చిన అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ మహిళ స్వచ్ఛందంగా తనతో సంబంధాన్ని కొనసాగించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై చేసిన ఫిర్యాదులో కూడా తప్పుడు ఆరోపణలు ఉన్నాయన్నారు. FIRలో ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పలేదని..కానీ సివిల్ దావాలో మాత్రం ఆ విషయాన్ని చేర్చారన్నారు. అది అవాస్తవమని స్పష్టం చేశారు.
వాదనల తర్వాత ఒడిషా హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో స్త్రీ అనుమతితోనే సంబంధం కొనసాగిందని గుర్తు చేసింది. 2012లో ఇద్దరూ ఒక సంబంధంలోకి ప్రవేశించినప్పుడు ఇద్దరూ మేజర్లు.. వారికి ఏం చేస్తున్నామో అవగాహన ఉందన్నారు. వారి ఇష్ట ప్రకారం జీవించే స్వేచ్చ వారికి అప్పుడు ఉందన్నారు. వారు తమ భవిష్యత్ కు సంబంధించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులోనే ఆ బంధంలోకి వెళ్లారన్నారు. అయితే అది వివాహ బంధంగా ముగియకపోవడం.. వ్యక్తిగత మనోవేదనకు కారణం అయి ఉండవచ్చు కానీ ప్రేమ వైఫల్యం నేరం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని మోసంగా పరిగణించలేమని తెలిపింది.
"వివాహం చేసుకుంటానని తప్పుడు హామీ" అనే ముసుగులో ప్రేమ వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని తెలిపింది. ప్రస్తుత కేసుకు సంబంధించి, వ్యక్తిగత సంబంధాలు తెగిపోవడంతో దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు కోర్టును ఓ సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం జరిగిందని కోర్టు అభిప్రాయ పడింది. మొదట సహజీవనం చేశామని చెప్పడం.. తర్వాత చట్టబద్దంగా పెళ్లిచేసుకున్నామని వాదించడంతో ఆ మహిళ నిజాలు చెబుతున్నారా లేదా అన్నది సందేహంగా మారిందన్నారు.
ఆ మహిళ 2023లో కుటుంబ కోర్టులో తాను చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వ్యక్తి భార్య అని ప్రకటించాలని, అతను మరెవరినీ వివాహం చేసుకోకుండా నిరోధించడానికి నిషేధం విధించాలని కోరుతూ ఒక సివిల్ దావా వేసింది. ఆ వ్యక్తి తనను ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడని, కానీ అతను దానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివాహ రిజిస్ట్రేషన్‌కు హాజరు కాలేదని ఆమె వాదించారు. కానీ దీనికి ఆధారాలు చూపించలేదు.