గుజరాత్‌లో ( Gujarat ) దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అందని ద్రాక్షగా ఉంది. అక్కడ నరేంద్రమోడీనే ఇప్పటికీ బీజేపీ తరపున ప్రధాన నేతగా ఉన్నారు. కాంగ్రెస్ ( Congress ) తరపున అలాంటి ఇమేజ్ ఉన్న నేత ఎవరూ లేరు. ఇటీవల హార్దిక్ పటేల్ ( Hardik Patel ) లాంటి వారు కలవడంతో కాంగ్రెస్‌కు కొత్త శక్తి వచ్చింది . అయితే అక్కడ గెలుపు సాధ్యమేనా అనేది మాత్రం సందేహంగానే ఉంది. దీంతో ప్రశాంత్ కిషోర్ సలహాలాలను తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.  ఈ ఏడాది చివరలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ రంగం దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 


గుజరాత్ ఎన్నికల విషయంలో కలిసి పని చేసేందుకు రాహుల్ గాంధీని ( Rahul Gandhi )  ప్రశాంత్ కిషోర్ కలిసినట్లుగా చెబుతున్నారు. కొంతమంది గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ప్రశాంత్‌ కిషోర్‌ను తీసుకోవడానికి ఆసిక్తగా చూపుతున్నట్లు సమాచారం. తుది అభిప్రాయం మాత్రం రాహుల్‌ గాంధీదేనని చెబుతున్నారు. ఈ విషయంలో గుజరాత్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ మన్నించే అవకాశాలు ఉన్నాయి. ఒప్పందం జరిగితే.. ప్రశాంత్ కిషోర్‌కు ( Prasant Kishore ) చెందిన ఐ ప్యాక్ టీం అక్కడ కూడా రంగంలోకి దిగే అవకశం ఉంది. 


బెంగాల్‌లో మమతా బెనర్జీ ( Mamata benarjee ) పార్టీ తరపున వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్... విజయం సాధించిన తర్వాత ఇక తాను వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది.  అయితే పలు కారణాలతో చేరలేదు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం ప్రారంభించారు.  ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్‌లోనూ వెనకబడిపోవడంతో కాంగ్రెస్‌కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. గతంలో కాంగ్రెస్ పంజాబ్‌లో గెలిచినప్పుడు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా ఉన్నారు. 


గుజరాత్‌లో పనిచేయడాన్ని ప్రశాంత్ కిషోర్‌ కూడా చాలెంజింగ్‌గా తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా... తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. మోడీ, అమిత్ షాల కంటే తానే తెలివైన వ్యహకర్తను అని నిరూపించుకునే క్రమంలో గుజరాత్‌లో కాంగ్రెస్ విజయాన్ని చాలెంజింగ్‌గా తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.