Porsche Car Accident Case: పోర్షే యాక్సిడెంట్‌ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం (Porshce Crash Case) వెలుగులోకి వస్తోంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్న పోలీసులకు కీలక విషయం తెలిసింది. ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా రెండు నెలల క్రితం మైనర్‌కి బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ పోర్షే కార్‌ని తాత సురేంద్ర అగర్వాల్ ప్రెజెంట్ చేశాడు. ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ పోర్షే కార్‌ ఫొటో పెట్టి తన మనవడికి ఇది బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు మెసేజ్ పెట్టాడు. సురేంద్ర అగర్వాల్ స్నేహితుడు ఈ విషయం పోలీసులతో చెప్పాడు. ఇప్పటికే ఈ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. మే 19న ఈ యాక్సిడెంట్ జరిగింది. పబ్‌లో మద్యం సేవించిన మైనర్‌ పోర్షే కార్‌ని వేగంగా నడిపి యాక్సిడెంట్ చేశాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఓ యువతి, యువకుడు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మైనర్‌ని అదుపులోకి తీసుకుని చితకబాదారు. ఆ తరవాత పోలీసులకు అప్పగించారు. ఈ కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు తండ్రి చాలా ప్రయత్నాలే చేశాడు. మైనర్ తండ్రి సిటీలో ఓ బడా రియల్టర్ కావడం వల్ల సరిగా విచారణ జరగడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 


అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నిందితుడి తండ్రి ఊరొదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. మొత్తానికి పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆ తరవాత నిందితుడి తాత సురేంద్ర అగర్వాల్‌నీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో డ్రైవర్‌ని నిందితుడిగా చూపించేందుకు కుటుంబ సభ్యులు గట్టిగానే ప్లాన్ చేశారు. డ్రైవర్‌ని బెదిరించి బంధించి పోలీసులకు తానే కార్ నడుపినట్టు స్టేట్‌మెంట్ ఇవ్వాలని హెచ్చరించారు. ఆ తరవాత అతని భార్య వచ్చి వాళ్ల చెర నుంచి విడిపించింది. ఈ యాక్సిడెంట్ చేసినప్పుడు నిందితుడు స్పృహలోనే ఉన్నాడని పుణే పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మైనర్ కావడం వల్ల ఏదో ఓ లొసుగు చూపించి బయటపడొచ్చని ప్రయత్నించారని వివరించారు.