New Born Babies Killed: ఢిల్లీలో పిల్లల ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వివేక్ విహార్‌ ఏరియాలోని హాస్పిటల్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో 12 మంది పసికందులు ఉన్నారు. ప్రమాదానికి ముందే ఓ చిన్నారి చనిపోగా...ఈ ప్రమాదం జరిగిన తరవాత ఆరుగురు మృతి చెందారు. మిగిలిన ఐదుగురిని వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై FIR నమోదు చేసుకున్న పోలీసులు హాస్పిటల్ ఓనర్‌ కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తి పరారయ్యాడు. మే25న అర్ధరాత్రి 11.30 గంటలకు ఉన్నట్టుండి హాస్పిటల్‌లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న బిల్డింగ్‌కీ ఈ మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసుల బృందం, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తెల్లవారుజాము వరకూ మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అప్పటికి కానీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. పక్కన బిల్డింగ్‌లో మాత్రం ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఆక్సిజన్ సిలిండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. 






"మంటలు ఆర్పడం చాలా కష్టంగా అనిపించింది. అంత దట్టంగా అలుముకున్నాయి. మొత్తం రెండు టీమ్స్‌గా విడిపోయి ఆపరేషన్‌ చేపట్టాం. ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్‌లు వరుసగా ఒకదాని తరవాత ఒకటి పేలాయి. అందుకే ఆ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. మమ్మల్ని మేము కాపాడుకుంటూనే రెస్క్యూ ఆపరేషన్‌ చేశాం. లోపల ఉన్న చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాం. కానీ కొంత మందిని కాపాడలేకపోయాం. ఈ ఘటనపై మేం ఎప్పటికీ ఓ రిగ్రెట్‌తోనే ఉంటాం"


- అతుల్ గర్గ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్






ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ప్రమాద వార్త విని గుండె పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కచ్చితంగా విచారణ జరిపించి తీరతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా ఇదే హామీ ఇచ్చారు.






Also Read: Rajkot Fire Accident: గుజరాత్‌లో గేమ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం, 22 మంది సజీవ దహనం