fire breaks out at the TRP game zone in Rajkot| రాజ్‌కోట్: గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌కోట్ లోని టీఆర్పీ గేమ్ జోన్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ ఆవరించి ఊపిరాడక భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకూ చిన్నారులు, మహిళలు సహా 22 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్ఛారు.




ఈ అగ్నిప్రమాదం ఘటనపై రాజ్‌కోట్‌ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ స్పందించారు. శనివారం మధ్యాహ్నం టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, తక్కువ సమయంలోనే గేమింగ్ జోన్ మొత్తం వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఇప్పటివరకూ సుమారు 20 మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీసినట్లు తెలిపారు. ఇందులో చిన్నారుల మృతదేహాలు కూడా ఉన్నాయని, ఘటన జరగడం చాలా దురదృష్టకరం అన్నారు.






రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తికి చెందిన టీఆర్పీ గేమ్ జోన్‌లో ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని సీపీ రాజు భార్గవ తెలిపారు. 


రాజ్‌కోట్ చరిత్రలో అతిపెద్ద విషాదం 
టీఆర్పీ గేమ్ జోన్‌లో జరిగిన ఘోర విషాదంపై బీజేపీ ఎమ్మెల్యే దర్శితా షా స్పందించారు. ఈ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం అన్నారు. నేడు రాజ్‌కోట్‌లో చాలా విచారకరమైన ఘటన జరిగింది. అగ్నిప్రమాదంలో చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరగడం రాజ్‌కోట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. రెస్క్యూ టీమ్ వీలైనంత  మందిని రక్షించడానికి ప్రయత్నాలు చేసిందన్నారు.