Pune Porsche Accident Case: పుణేలోని పోర్షే కార్ యాక్సిడెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడైన మైనర్ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుకుని ఈ కేసు నుంచి తప్పించేందుకు తన బ్లడ్ శాంపిల్‌ని టెస్ట్‌కి పంపించింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో తన కొడుకు మద్యం మత్తులో లేడని నిరూపించేందుకు అతని బ్లడ్ శాంపిల్‌కి బదులుగా తన బ్లడ్‌ని పంపింది. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మే 19వ తేదీన ఈ ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. మైనర్ కార్ నడపడమే నేరం అంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఇంకా తీవ్రమైన నేరం అని చాలా మంది గట్టిగా వాదించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, ఆ సంగతి గుర్తుంచుకుని శిక్ష విధించాలని తేల్చి చెబుతున్నారు.
ప్రస్తుతానికి 17 ఏళ్ల నిందితుడిని అబ్జర్వేషన్ హోమ్‌కి తరలించారు. ఇప్పటికే అతని తండ్రి, తాతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కార్ డ్రైవర్‌ని కిడ్నాప్ చేసి బలవంతంగా నేరం అంగీకరించాలని ఒత్తిడి చేశారు. ఇంట్లో బంధించారు. నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఇలా తప్పుల మీదు తప్పులు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పైగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. కావాలనే కొందరు నిందితుడికి సహకరించారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ మధ్యే నిందితుడి తల్లి ఓ వీడియో విడుదల చేసింది. తన కొడుకుని పోలీసులే కాపాడాలని కన్నీళ్లు పెట్టుకుంది