Kerala Nuns  Arrest in Chattisgarh: కేరళకు చెందిన ఇద్దరు కాథలిక్ నన్స్, సిస్టర్ ప్రీతీ మేరీ   సిస్టర్ వందనా ఫ్రాన్సిస్, చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారం దుమారం రేపుతోంది.  వీరితో పాటు సుకమాన్ మండవి అనే యువకుడ్ని  కూడా అరెస్టు చేశారు.  మానవ అక్రమ రవాణా ,  బలవంతపు మతమార్పిడిల కోసం మనుషుల్ని తరలిస్తున్నారని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు.  

జులై 25, 2025న, దుర్గ్ రైల్వే స్టేషన్‌లో సిస్టర్ ప్రీతీ మేరీ, సిస్టర్ వందనా ఫ్రాన్సిస్ , సుకమాన్ మండవి, ముగ్గురు యువతులతో (18-22 సంవత్సరాల వయస్సు) కలిసి ఆగ్రాకు ప్రయాణిస్తున్నప్పుడు అరెస్టయ్యారు. ఈ యువతులు చత్తీస్‌ఘడ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాకు చెందినవారు. స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్త జ్యోతి శర్మ ఫిర్యాదు మేరకు, ఈ నన్స్ ,సుకమాన్ మండవి ఈ యువతులను బలవంతంగా మతం మార్చి, మానవ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. చత్తీస్‌ఘడ్ రిలిజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ,  ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్ కింద కేసు నమోదు  చేశారు.  ఫిర్యాదు ఆధారంగా  రైల్వే పోలీసులు  ముగ్గురిని అరెస్ట్ చేసి, నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. యువతులను షెల్టర్ హోమ్‌కు తరలించారు. 

 అసిసి సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ (ASMI) అనే సంస్థలు ఇద్దరు నన్స్ సభ్యులు.  ఆగ్రాలోని ఒక కాన్వెంట్‌లో కిచెన్ హెల్పర్‌లుగా ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఈ యువతులను తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ యువతులు వారి తల్లిదండ్రుల అనుమతితో, స్వచ్ఛందంగా వచ్చినట్లు ASMI   మదర్ సుపీరియర్ ఇసాబెల్ ఫ్రాన్సిస్ చెబుతున్నారు.  ముగ్గురు యువతులలో ఒకరైన కమలేశ్వరి ప్రధాన్, తాము స్వచ్ఛందంగా ఉద్యోగం కోసం ఆగ్రాకు వెళ్తున్నామని, భజరంగ్ దళ్ కార్యకర్తలు తమను బెదిరించి, బలవంతంగా తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించారు.              

 ఈ అరెస్ట్‌లు కేరళలో రాజకీయంగా సున్నితమైన సమస్యగా మారాయి. కేరళ నన్స్ ను అరెస్టు చేయడంపై  కేరళ కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్  మైనారిటీల హక్కులపై దాడిగా ఆరోపిస్తోంది.  కేరళలో CPI(M)-నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ,  కాంగ్రెస్-నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఈ అరెస్ట్‌లను ఖండించాయి.  నన్స్ విడుదల కోసం నిరసనలు చేపట్టాయి.  UDF ఎంపీలు దుర్గ్ జైలులో నన్స్‌ను పరామర్శించారు.    జులై 30న, దుర్గ్ జిల్లా కోర్టు ఈ ముగ్గురి బెయిల్ అర్జీని తిరస్కరించింది. ఆగస్టు 2,  బిలాస్‌పూర్‌లోని NIA కోర్టు ప్రీతీ మేరీ, వందనా ఫ్రాన్సిస్,  సుకమాన్ మండవిలకు  బెయిల్ మంజూరు చేసింది. వారు తమ పాస్‌పోర్ట్‌లను సరెండర్ చేయాలని. దర్యాప్తులో సహకరించాలని  ఆదేశించింది.                        

నన్స్ ఇద్దరూ కేరళకు చెందిన వారే కానీ చత్తీస్ ఘడ్‌లో మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పేదలకు ఆశ పెట్టి మతం మారుస్తున్నారని అంటున్నారు.