Prime Minister Modi calls for buying only indigenous products: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు వేసిన సమయంలో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రైతులు, చిన్న తరహా పరిశ్రమలు , యువత సంక్షేమాన్ని ప్రభుత్వం తన ప్రధాన ప్రాధాన్యతగా భావిస్తుందని స్పష్టం చేశారు. వారణాసిలో జరిగిన ఒక బహిరంగ సభలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అస్థిర వాతావరణంలో భారతదేశం తన ఆర్థిక ప్రయోజనాల పట్ల   జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకం విధించారు.   రష్యా నుండి చమురు , ఆయుధాలు రి కొనుగోలు చేస్తున్నందుకు మరింత జరిమానాలు విధిస్తామని హెచ్చరించిన  తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 

స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి ! 

దేశీయ వస్తువులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు  పిలుపునిచ్చారు, ఇది దేశ సేవకు ఒక నిజమైన నివాళిగా ఉంటుందని, మహాత్మా గాంధీకి సమర్పణగా ఉంటుందని పేర్కొన్నారు.  “ప్రపంచం అస్థిరత వాతావరణంలో ఉన్నప్పుడు, మనం కూడా స్వదేశీ వస్తువులను మాత్రమే విక్రయించాలి. ప్రతి క్షణం, మనం స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి,” అని ఆయన అన్నారు. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉందని, అందుకే దేశం తన ఆర్థిక ప్రయోజనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ అన్నారు. “మా రైతులు, చిన్న తరహా పరిశ్రమలు, యువతకు ఉపాధి... వారి సంక్షేమం మా అత్యంత ప్రాధాన్యత. ప్రభుత్వం ఈ దిశలో అన్ని ప్రయత్నాలు చేస్తోంది,” అని స్పష్టం చేశారు. 

మహాత్ముడే ఆదర్శం

మోదీ తన పిలుపును మహాత్మా గాంధీ  స్వదేశీ ఉద్యమంతో ముడిపెట్టారు.  స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా, భారతీయులు గాంధీ   ఆదర్శాలను సమర్థించడమే కాక, దేశ ఆర్థిక బలాన్ని పెంపొందించవచ్చని ఆయన అన్నారు.స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ రైతులు ,  చిన్న పరిశ్రమలను రక్షించవచ్చన్నారు.  స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా, అమెరికా వంటి దేశాల సుంకా ప్రభావాన్ని తగ్గించవచ్చని, దీనివల్ల దేశీయ పరిశ్రమలు ,  ఉపాధి అవకాశాలు దెబ్బతినవని భావిస్తున్నారు.  

     వారణాశిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు  మోదీ తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో 51వ సందర్శన సందర్భంగా, 2,180 కోట్ల రూపాయల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని ప్రారంభించారు.  వీటిలో వారణాసి-భదోహీ రోడ్డు, చితౌని-షూల్ టంకేశ్వర్ రోడ్డు విస్తరణ మరియు హర్దత్‌పూర్ వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ నిర్మాణం వంటివి ఉన్నాయి. అదనంగా, ఆయన పీఎం-కిసాన్ పథకం కింద 20,500 కోట్ల రూపాయలను రైతులకు బదిలీ చేశారు   ఆరోగ్యం, విద్య, పర్యాటకం, మౌలిక సదుపాయా,  గ్రామీణాభివృద్ధి రంగాలలో కొత్త పథకాలను ప్రారంభించారు.