ED Cases : తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వారికి కాస్త రిలీఫ్ ఇచ్చింది. సీఎం జగన్‌పై ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొదట సీబీఐ ఛార్జిషీట్లపైనే తేల్చాలని … ఆ కేసులు వీగిపోతే ఈడీ కేసులు కూడా ఉండవని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సీబీఐ కేసులు  తేలేవరకూ ఈడీ కేసులపై తీర్పు వెల్లడించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 సీబీఐ, 9 ఈడీ ఛార్జిషీట్లపై హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.


సీబీఐ కేసుల్లో విచారణ తేలిపోతే .. ఈడీ కేసులు ఉండవన్న హైకోర్టు 


హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక్క జగన్ అక్రమాస్తుల కేసుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా దూకుడు చూపిస్తున్న ఈడీకి షాక్ ఇచ్చినట్లయిందన్న అభిప్రాయం రాజకీయ, న్యాయ వర్గాల్లో వినిపిస్తోంది.  సాధారణంగా ఈడీ నేరుగా కేసులు దాఖలు చేయదు. మనీలాండరింగ్ జరిగినట్లుగా స్పష్టమైన ఆధారాలుంటే సొంతంగా కేసు నమోదు చేస్తుంది. ఈడీ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం  సీబీఐ లేదా ఐటీ అధికారులు నమోదు చేసే కేసులకు కొనసాగింపే. ఆయా దర్యాప్తు సంస్థలు నమోదు చేసే కేసుల నుంచి వివరాలు తీసుకుని అందులో మనీలాండరింగ్ ఉంటే కేసులు నమోదు చేస్తుంది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముందు సీబీఐ కేసు నమోదు చేసింది. తర్వాత ఆ ఫైళ్లను తీసుకుని  ఈడీ కేసులు నమోదు చేసింది. వాటి ఆధారంగా దేశవ్యాప్తంగా సోదాలు కూడా చేసింది.  


ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ సీబీఐ కేసు తేలిపోతే....ఈడీ కేసులు తేలిపోయినట్లే ! 


దర్యాప్తు సంస్థల ఆధారంగా కేసులు పెట్టిన  ఏ విషయంలో అయినా ప్రస్తుతం  హైకోర్టు ఇచ్చిన తీర్పు వర్తిస్తుంది.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనూ సీబీఐ విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసులు విచారణ చేయాల్సి ఉంటుంది. ఒక వేల సమాంతరంగా విచారణ జరిపితే తీర్పు మాత్రం సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే ఇవ్వాల్సి ఉంటుంది.  అదే సమయంలో సీబీఐ కోర్టులో కేసులు నిలబడకపోతే.. ఈడీ కేసులోనూ నిలబడనట్లే. హైకోర్టు ఇచ్చిన తీర్పు తో  సీబీఐ లేదా ఐటీ విచారణ పూర్తయిన తర్వాత.. అందులో నేరం చేశారని తేలితేనే ప్రోసీడ్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఈడీ కేసులు కూడా తేలిపోతాయి. 


సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కేసులు నమోదైన రాజకీయ నేతలందరికీ ఊరటే ?


నిజానికి సీబీఐ కేసులతో సంబంధం లేకుండా తమ కేసులపై విచారణ ప్రారంభించాలని గతంలో సీబీఐ కోర్టును ఈడీ కోరింది. సీబీఐ కేసులు క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని.. ఈడీ మాత్రం అక్రమంగా నగదు చెలామణి చేశారన్న కేసులు నమోదు చేసిందని తెలిపారు. రెండూ వేర్వేరు నేరాలని వాదించారు.  సీబీఐ కోర్టు ఈ వాదనతో అంగీకరించింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల  విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్  దాఖలు చేసిన పిటిషన్లపై  మాత్రం హైకోర్టు భిన్నమైన తీర్పు ఇచ్చింది. ఈ తీరపును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందో లేదో కానీ..ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న అనేక కేసుల్లో ఈ తీర్పుప్రకారం చూస్తే తీర్పులు ఇప్పుడల్లా వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.