AP CM Chandrababu | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏపీలోని జిల్లా, మండల పరిషత్తులకు, పంచాయతీలకుగానూ 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.1,121.20 కోట్లు విడుదల చేయగా.. అందులో పంచాయతీలకు 70 శాతం నిధులు, మండల పరిషత్తులకు 20 శాతం, జిల్లా పరిషత్తులకు 10 శాతం కేటాయించింది.  2024-25 సంవత్సరానికి రెండో విడతగా టైడ్, బేసిక్‌ కింద కేంద్రం విడుదల చేసిన నిధులను కూటమి ప్రభుత్వం మండల జిల్లా పరిషత్తులు, పంచాయతీలకు అందించింది. జనాభా ఆధారంగా గ్రామీణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు నిధులను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ 2 నుంచి 3 రోజుల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. 

ఏపీకి కేంద్రం ఉపాధి హామీ పథకం కూలీలకు  తీపికబురు చెప్పింది. వారికి కేంద్రం బకాయిలు రూ.961.46 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నెల నుంచి రావాల్సిన ఉపాధి  పనుల బకాయిలు కూలీల ఖాతాల్లో జమ  కానున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఇటీవల కేంద్రానికి ఈ విషయంపై లేఖ రాశారు. గత రెండున్నర నెలలుగా నిధులు రావడం లేదని, ఉపాధి హామీ కూలీలకు నిధులు పెండింగ్ లో ఉన్నాయని విజ్ఞప్తి చేయడంతో స్పందించిన కేంద్రం నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది.