ప్రధాని పర్యటన కోసం హడావుడిగా మరమ్మతులు..


సీఎం, పీఎం పర్యటనల సమయంలో అధికారులు చేసే హడావుడి మామూలుగా ఉండదు. అప్పటి వరకూ గతుకులుగా ఉన్న రోడ్లపై వెంటనే డాంబర్ వేసి, బాగు చేసి అద్దంలా మెరిసేలా చేస్తారు. చాలా మంది దీనిపై సెటైర్లు కూడా వేస్తుంటారు. బెంగళూరులోని అధికారులూ ఇలాగే చేసి, చివరకు బుక్ అయ్యారు. ఈ నెల 20వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనకు ముందే బృహత్ బెంగళూరు మహానగర పాలికే-BBMP సంస్థ రోడ్లపై తారు పోసి గుంతలన్నింటినీ కవర్ చేసింది. అప్పటికప్పుడు రోడ్లనుబాగు చేసింది. ఇందుకోసం రూ. 23.5 కోట్లు ఖర్చు చేసింది. అయితే ప్రధాని పర్యటించి వెళ్లిన 48 గంటల్లోనే దక్షిణ బెంగళూరులోని జ్ఞాన భారతి మెయిన్‌ రోడ్‌లో ఓ ప్రాంతంలో రోడ్డు కుంగిపోయి గుంట పడటం చర్చకు దారి తీసింది.  


వివరణ కోరిన పీఎం కార్యాలయం


ఈ రోడ్ మరమ్మతుల కోసం నగరపాలిక సంస్థ రూ. 6కోట్ల ఖర్చు చేసింది. అయితే వర్షం పడిన వెంటనే రోడ్డు కుంగిపోయింది. ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనకు వచ్చిన సమయంలో ఈ దారిలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీకి వెళ్లారు. కేవలం ఈ పర్యటనను దృష్టిలో ఉంచుకునే ఏదో తూతూ మంత్రంగా తారుపోశారు అధికారులు. ఇప్పుడది కుంగిపోయే సరికి, ఈ విషయం కాస్తా పీఎమ్‌ ఆఫీస్ వరకూ వెళ్లింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకు ఆదేశాలు పంపింది పీఎమ్ కార్యాలయం. వెంటనేఅప్రమత్తమైన సీఎం ఎందుకిలా జరిగిందో వివరణ ఇవ్వాలంటూ బీబీఎపీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. 


"ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బీబీఎమ్‌పీ కమిషనర్‌కి ఆదేశాలిచ్చాను. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పాను. ఇటీవలే ఆ రోడ్‌లో వాటర్ పైప్‌లు వేశారని, అవి లీక్ అవ్వటం వల్లే రోడ్ డ్యామేజ్ అయింది ప్రాథమికంగా తెలుస్తోంది" అని సీఎం బసవరాజు బొమ్మై ట్వీట్ చేశారు. 14 కిలోమీటర్ల రోడ్లు బాగు చేసేందుకు రూ.23 కోట్లు ఖర్చు చేశారని, అయినా ఇలా జరిగిందంటే అది కచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమేనని పీఎం కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది.