PM Narendra Modi Address To Nation Today Night at 8 PM: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు కీలక విషయాలు చెప్పనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ అంశంలో జరిగిన పరిణామాలు, కాల్పుల విరమణ గురించి మాట్లాడే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన రోజు రాత్రి ఏబీపీ నెట్ వర్క్ నిర్వహించిన  ఇండియా @ 2047 సమ్మిట్ లో ప్రసంగించారు. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ ను లైవ్ లో పర్యవేక్షించారు. అప్పటి నుంచి జరుగుతునన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ .. త్రివిధ దళాలు, అధికారులు,  మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. 

ఇప్పుడు అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఈ మొత్తం అంశంపై ప్రధాని దేశ ప్రజలకు కీలక విషయాలను చెప్పాలనుకుంటున్నరాు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ సాధించిన విజయాలతో పాటు పాకిస్తాన్ ను ఎలా దెబ్బ కొట్టాం అన్న అంశంపై వివరించే అవకాశం ఉంది. భారత త్రివిధ దళాల వీరత్వం గురించి మోదీ చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారత్ తన ధృడ వైఖరితో ఉందని.. పాకిస్తాన్ మరో సారి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే సహించేది లేదని సంకేతాలు పంపే అవకాశాలు ఉన్నాయి. 

భారత్ , పాకిస్తాన్ మధ్య మిలటరీ జనరల్స్ స్థాయిలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపైనా ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఉదయం  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్‌, పాక్‌ చర్చల నేపథ్యంలో వివిధ అంశాల పై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రక్షణ ఉన్నతాధికారులతో  కూడా ప్రధాని సమావేశమయ్యారు. మిలటరీ జనరల్స్ స్థాయి చర్చల్లో    48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు , ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి.    పాక్ లో ఉన్న మసూద్ అజార్ తో పాటుగా టాప్ ఉగ్రవాదులను అప్పగించాలని భారత్ డిమాండ్ చేయనుంది.  

ప్రధానమంత్రి  మోదీ దేశప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. దేశ భద్రత విషయంలో  రాజీ పడేది లేదని.. ఎలాంటి యుద్దాలనైనా అవలీలగా అధిగమించే, గెలిచే సత్తా భారత్ సొంతమయిందని తెలిపే అవకాశం ఉంది.