Airports Authority Of India: ఆపరేషన్ సింధూర్ తరువాత ఏర్పడిన ఉద్రిక్తతలతో తాత్కాలికంగా మూసివేసిన 32 విమానాశ్రయాలు తెరవాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మే 15 ఉదయం 5.29 గంటల వరకు మూసివేయాలని మే 7న నిర్ణయించిన 32 విమానాశ్రయాలు తెరుచుకోనున్నాయని ఏఏఐ తెలిపింది. తక్షణం ఆ విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తున్నాయి, సేవలు అందిస్తాయని AAI ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని 32 విమానాశ్రయాలను తెరవడానికి ఎయిర్‌మెన్‌కు విమానాశ్రయ అధికార సంస్థ సోమవారం (మే 12, 2025)న నోటీసు జారీ చేసింది. 

ఈ 32 విమానాశ్రయాలలో అంబాలా, అమృత్‌సర్, అధంపూర్, అవంతిపూర్, బఠిండా, భుజ్, హల్వారా, హిండన్, బీకనీర్, చండీగఢ్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, శ్రీనగర్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), జోధ్‌పూర్,కేశోద్, కిషన్‌గఢ్, లేహ్, లూధియానా, కులు మనాలి (భుంతర్), ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పటియాలా, పోరుబందర్, రాజ్‌కోట్, సర్సావా, సిమ్లా, తోయిస్, ఉత్తరాలై ఉన్నాయి.

ఇటీవల పాక్, భారత్ మధ్య కాల్పులు, ప్రతిదాడులతో ఇక్కడి నుంచి 200 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారతదేశంలోని వివిధ ప్రధాన ఎయిర్ లైన్స్ సైతం తమ ప్రయాణికులకు సలహాలు, సూచనలను జారీ చేశాయి. వారు తనిఖీ చేసుకుని, అనుగుణంగా తమ జర్నీని ప్లాన్ చేసుకోవాలని ఎయిర్ లైన్స్ సూచించాయి. 

AAI ప్రెస్ నోట్ విడుదల  

మే 10న భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల, దాడుల విరమణ ప్రకటన చేశారు. అదేరోజు రాత్రి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ దాడితో పాటు కాల్పులు జరిపింది. అయితే ఆదివారం (మే 11, 2025)న LOC వద్ద కు శాంతియుత పరిస్థితి నెలకొంది. పాక్ కాల్పుల విమరణ చేయడంతో AAI ఇటీవల మూసివేసిన 32 విమానాశ్రయాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం, ఈ ఎయిర్‌పోర్టులు తక్షణమే అందుబాటులోకి రావాలి. "ఈ విమానాశ్రయాలు ఇప్పుడు వెంటనే పౌర విమానాల కార్యకలాపాలకు అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి మే 15న ఉదయం 5.29 గంటల వరకు ఈ విమానాశ్రయాలు మూసివేయాలని మొదట నిర్ణయించాం. అయితే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాలు రీఓపెన్ చేయాలని ఏఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ నోటీసు విడుదల చేసింది.