China Taiwan Conflict: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకోనున్న నరేంద్ర మోదీ పలు దేశాల అధినేతలు సోషల్ మీడియాలో అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తే (Lai Ching-te) కంగ్రాట్స్ చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. తైవాన్ భారత్ భాగస్వామ్యం అన్ని రంగాల్లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. ఇండో పసిఫిక్‌లోనూ శాంతియుత వాతావరణానికి కలిసి కృషి చేయాలని వెల్లడించారు. ఈ ట్వీట్‌కి ప్రధాని నరేంద్ర మోదీ రిప్లై ఇచ్చారు. తైవాన్‌తో మైత్రి కొనసాగించేందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలిపారు. కానీ ఇదంతా చూసి చైనా కడుపు మండింది. ప్రధాని మోదీ తైవాన్ అధ్యక్షుడి ట్వీట్‌కి స్పందించడంపై మండి పడింది. తైవాన్‌ని గుర్తించడానికే ఇష్టపడని చైనా "తైవాన్‌కి అధ్యక్షుడు అనే వ్యక్తే లేరు" అని తేల్చి చెప్పింది. ఇండియాలోని చైనా ఎంబసీ ఓ పోస్ట్ పెట్టింది. తైవాన్ ఎప్పటికైనా చైనాలో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. తమ ప్రభుత్వమే తైవాన్‌కీ ప్రాతినిధ్యం వహిస్తోందని వెల్లడించింది. ఇది ఎవరూ కాదనలేని నిజం అని తెలిపింది.
"తైవాన్‌కి అధ్యక్షుడు అనే వ్యక్తే లేరు. తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే. పీపుల్స్ రిపబ్లిక్ చైనా ప్రభుత్వం తైవాన్‌ని తమలో భాగమే అని ఎప్పుడో తేల్చి చెప్పింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలోనూ ఇది గుర్తు పెట్టుకోవాలి"
- చైనా ఎంబసీ
అయితే మనస్పూర్తిగా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపితే మధ్యలో చైనా జోక్యం చేసుకోవడాన్ని తైవాన్ తప్పుబట్టింది. ఇలా బెదిరింపుల వల్ల మైత్రిని కొనసాగించలేమని స్పష్టం చేసింది. భారత్‌తో తైవాన్ పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బంధాన్ని బలపరుచుకోవాలని చూస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు తైవాన్ విదేశాంగ శాఖ X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. చైనా మాత్రం భారత్ తైవాన్‌తో రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. అయితే చైనా ఇలా అభ్యంతరం తెలపడంపై అమెరికా మండి పడింది. విజయం సాధించినప్పుడు కంగ్రాట్స్ చెప్పడం చాలా సహజమైన విషయమని...అనవసరంగా రాజకీయాలు చేయొద్దని తేల్చి చెప్పింది.