Indira Gandhi Donate Gold: కాంగ్రెస్ దేశ సంపదని, ఆడవాళ్ల నగల్ని కొల్లగొట్టి ముస్లింలకు పంచిపెడుతుందని ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాదాపు రెండు రోజులుగా దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. అయితే...ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలూ మరింత కీలకంగా మారాయి. ఇందిరా గాంధీ తన మంగళసూత్రాన్ని దేశం కోసం త్యాగం చేసిందంటూ రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది. రాజీవ్ గాంధీ దేశం కోసమే ప్రాణాలొదిలారని, అలా ఇందిరా గాంధీ తన మంగళసూత్రాన్ని దేశానికి త్యాగం చేశారని అన్నారు ప్రియాంక గాంధీ. అంతే కాదు. అంతకు ముందు తన నానమ్మ భారత్ యుద్ధ కాలంలో ఉన్నప్పుడు తన బంగారు ఆభరణాలన్నింటనీ దేశం కోసం ఇచ్చేసిందని వెల్లడించారు. గాంధీ కుటుంబ త్యాగాల్ని ప్రధాని మోదీ మర్చిపోవద్దంటూ మండి పడ్డారు. ఈ క్రమంలోనే అసలు ప్రధాని కాంగ్రెస్ గురించి ఎందుకిలా మాట్లాడారు..? బంగారం ప్రస్తావన ఎందుకు వచ్చిందనేదే కీలకంగా మారింది.
ఈ బంగారం కథేంటి..?
1962లో భారత్, చైనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. Chinese People's Liberation Army భారత్‌పై యుద్ధానికి సిద్ధమైంది. లద్దాఖ్‌లోని చుషూల్ ప్రాంతంలో ఆ సైన్యం మొహరించింది. ఆ సైనికులతో పోరాడేందుకు భారత్ కూడా సన్నద్ధమైంది. అప్పటి నెహ్రూ ప్రభుత్వం కొన్ని ప్రకటనలు చేసింది. దేశంలోని మహిళలంతా తమ బంగారు ఆభరణాల్ని దేశం కోసం త్యాగం చేయాలని కోరింది. డబ్బులతో పాటు ఉలెన్ దుస్తులూ డొనేట్ చేయాలని అడిగింది. ఆ సమయంలోనే నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కూడా తన బంగారు ఆభరణాల్ని విరాళంగా ఇచ్చింది. అదే విషయాన్ని ఇప్పుడు ప్రియాంక గాంధీ ప్రస్తావించారు.
చైనాతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇందిరా గాంధీ ముందుగా చొరవ చూపించి తన ఆభరణాల్ని విరాళంగా ఇచ్చినట్టు అప్పటి వార్తా కథనాలు వెల్లడించాయి. కొంతకాలం వరకూ భారత్-చైనా మధ్య యుద్ధం జరిగినప్పటికీ ఆ తరవాత బీజింగ్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. కానీ...అప్పట్లో ఇచ్చిన ఈ బంగారు నగల లెక్కలు మాత్రం ఇప్పటికీ తేలలేదు. అవి RBI రికార్డులలోనూ లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్ మంగళసూత్రాలతో సహా దోచుకుని ముస్లింలకు ఇచ్చేస్తుందని మండి పడ్డారు.
Also Read: సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు