Ramdev's Apology in News Papers: పతంజలి ప్రకటనల వివాదం (Patanjali misleading ads case) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు మందలించినా తీరు మార్చుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే అక్షింతలు వేసింది. ఆ తరవాత రామ్‌దేవ్‌ బాబాతో పాటు ఆచార్య బాలకృష్ణ స్పందించారు. కోర్టుకు క్షమాపణలు చెప్పారు. అయితే...పేపర్లలో పతంజలి ప్రకటనలు ఏ సైజ్‌లో అయితే వేస్తారో అదే సైజ్‌లో క్షమాపణలు చెబుతూ ప్రకటనలు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే ఓ రోజు యాడ్స్‌ వేసిన పతంజలి వరుసగా రెండోరోజూ ప్రకటన ఇచ్చింది. "unconditionally apologise" పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు వేయించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు అందరినీ క్షమాపణలు కోరుతున్నట్టు అందులో పేర్కొంది. 


"ఇప్పటి వరకూ మా ప్రకటనల్లో వచ్చిన తప్పులకు క్షమాపణలు కోరుతున్నాను. ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతాం. ఇకపై నిబద్ధతగా ఉంటాం"


- పతంజలి 



అంతకు ముందు సుప్రీంకోర్టు పతంజలిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. పతంజలి ఉత్పత్తులపై న్యూస్‌ పేపర్‌లలో భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. క్షమాపణలు కూడా అదే స్థాయిలో చెప్పాలని స్పష్టం చేసింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్‌సనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనానికి రామ్‌దేవ్‌ బాబా వివరణ ఇచ్చారు. దాదాపు 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు కోరుతూ ప్రకటనలు ఇచ్చినట్టు వెల్లడించారు. వీటి కోసం తమ సంస్థ రూ.10 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే...క్షమాపణలు చెప్పిన తీరునీ తప్పుబట్టింది కోర్టు. 


"మీరు ఇచ్చిన ప్రకటనల సైజ్‌ని మార్చి మాకు చూపించకండి. వాటిని ఏ సైజ్‌లో ప్రింట్ చేయించారో చెప్పండి. ఇంత చిన్నగా ఉంటే మైక్రోస్కోప్‌లు పెట్టుకుని చూడాలా..? కేవలం పేపర్‌మీద కనిపిస్తే చాలదు. అందరికీ కనిపించాలి"


- సుప్రీంకోర్టు