PM Modi Banswara Rally: రాజస్థాన్‌లోని బన్‌స్వరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. ముస్లింలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్‌పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. I.N.D.I.A కూటమిపై విమర్శలు చేసే క్రమంలో ప్రతిపక్ష నేతలు అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకే దోచిపెడతారని అన్నారు మోదీ. అంతే కాదు. ఆ నేతలకు అర్బన్ నక్సల్ మైండ్‌సెట్ అంటూ తీవ్రంగా విమర్శించారు. మంగళసూత్రాలను కూడా వదలకుండా దోచుకుంటారని, వాళ్లు ఆ స్థాయికి దిగజారిపోతారని అన్నారు. ఒకప్పుడు మన్మోహన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ దేశ ఆస్తులపై ముస్లింలకే ప్రాథమిక హక్కు ఉందని కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తు చేశారు. దీనిపైనే కూటమి మండి పడుతోంది. అసలు సమస్యల్ని పక్కదోవ పట్టించి అనవసరమైన వ్యాఖ్యలు చేయడమేంటని అసహనం వ్యక్తం చేస్తోంది. 


"ప్రతిపక్ష కూటమి నేతల తీరు ఎలాంటిది అంటే వాళ్లు మన తల్లుల, చెల్లెళ్ల మంగళసూత్రాలు కూడా వదలకుండా దోచుకుంటారు. ఆ స్థాయికి దిగజారిపోగలరు. బంగారం ఎంతుందో లెక్కించి దాన్ని అందరికీ పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఆ బంగారాన్ని ఎవరికి దోచి పెడతారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశ ఆస్తులపై ముస్లింలకే ప్రాథమిక హక్కు ఉందని కాంగ్రెస్ చెప్పింది. అంటే వాళ్లు ఎవరికి ఆస్తులన్నీ పంచి పెడతారో అర్థమవుతోందిగా. ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకే ఇవన్నీ దోచి పెడతారు. ఆ చొరబాటుదారులకు దేశ ఆస్తుల్ని దోచి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా"


- ప్రధాని మోదీ 


 






ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. మొదటి విడత ఓటింగ్‌లోనే బీజేపీకి వ్యతిరేక ఓట్లు పడ్డాయని అర్థమైందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఊహించని స్పందన వస్తోందని తేల్చి చెప్పారు.






AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు. ముస్లింలను చొరబాటుదారులు అనడంపై మండి పడ్డారు. 2002 నుంచి ఇప్పటి వరకూ బీజేపీ అజెండా ముస్లింలను వేధించడమే అని విమర్శించారు. దేశ సంపదనంతా స్నేహితులకు దోచి పెడుతున్న మోదీ దేశ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. హిందువులు ముస్లింలను భయపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. X వేదికగా వరుస పోస్ట్‌లు పెట్టారు అసదుద్దీన్.