ICICI Bank Account New Service Charges: దేశంలో రెండో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్, వివిధ లావాదేవీలపై తాను వసూలు చేసే ఛార్జీలను సవరించింది. ఐఎంపీఎస్‌, చెక్ బుక్, డెబిట్ కార్డ్ యాన్యువల్‌ ఫీజ్‌, ఇంట్రస్ట్‌ సర్టిఫికేట్, బ్యాలెన్స్ తనిఖీ, చిరునామా మార్పు వంటి అనేక విషయాల్లో వసూలు చేసే ఛార్జీలను బ్యాంక్ మార్చింది. ఈ సేవలకు సంబంధించిన కొత్త ఛార్జీలు వచ్చే నెల (01 మే 2024) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.


ఐసీఐసీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం... డెబిట్ కార్డ్ వార్షిక రుసుము ‍‌(Debit card annual fee) పెరిగింది. ఇకపై, బ్యాంకు ఖాతాదార్లు పట్టణ ప్రాంతాల్లో వార్షిక రుసుముగా రూ. 200 & గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99 చెల్లించాలి. చెక్‌ బుక్‌ నుంచి 25 లీఫ్‌లు జారీ చేయడానికి ఖాతాదార్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. 26వ చెక్‌ నుంచి, ఒక్కో చెక్కుకు రూ. 4 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. DD లేదా PO రద్దు చేసినా లేదా డూప్లికేట్ రీవాలిడేట్ చేసినా రూ. 100 సమర్పించుకోవాలి. IMPS ద్వారా రూ. 1,000 మొత్తాన్ని బదిలీ చేయాలంటే, ప్రతి లావాదేవీకి రూ. 2.50 అదనంగా కట్టాలి.


ఒక రూపాయి నుంచి 25 వేల రూపాయల వరకు లావాదేవీలపై (Cash transactions) 5 రూపాయలు; 25 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల లావాదేవీలపై 15 రూపాయలు సర్వీస్ ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అకౌంట్‌ క్లోజ్‌ చేయాలనుకుంటే, దాని కోసం ఒక్క రూపాయి కూడా సర్వీస్‌ ఛార్జ్‌ను కూడా బ్యాంక్‌ తీసుకోదు. 


డెబిట్ కార్డ్ పిన్ రీజెనరేట్‌ చేసినా సర్వీస్ ఛార్జ్ ఉండదు. బ్యాలెన్స్ చెక్‌ (Balance check) చేయడం, ఇంట్రస్ట్‌ సర్టిఫికేట్ (Certificate of Interest) పొందడం, పాత లావాదేవీలు తీసుకోవడం వంటి వాటికి సర్వీస్ ఛార్జీ సున్నా. సంతకం ధృవీకరణ విషయంలో ప్రతి లావాదేవీకి రూ. 100 చెల్లించాలి. ECS/NACH డెబిట్ కార్డ్ రిటర్న్‌లపై కస్టమర్లు రూ. 500 రుసుము చెల్లించాలి. ఇంటర్నెట్ యూజర్ ఐడీ లేదా పాస్‌వర్డ్‌ను మళ్లీ జారీ చేయడానికి బ్యాంక్‌ ఏమీ వసూలు చేయదు. కస్టమర్లు చిరునామా మార్పు (Change of address) అభ్యర్థనపైనా జీరో సర్వీస్ ఛార్జీని బ్యాంక్‌ ప్రకటించింది. స్టాప్ పేమెంట్ ఛార్జీ రూపంలో రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.


క్యాష్‌ డిపాజిట్ ఛార్జీలలో కూడా మార్పు
నగదు జమ ఛార్జీల్లో కూడా ‍‌(Cash deposit charge) ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్పులు చేసింది. బ్యాంకు సెలవులు, సాధారణ పని దినాల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య క్యాష్‌ డిపాజిట్ మెషీన్‌లో రూ. 10,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, ఒక్కో లావాదేవీకి రూ. 50 చొప్పున బ్యాంక్‌ వసూలు చేస్తుంది. అయితే... సీనియర్ సిటిజన్లు, జన్ ధన్ ఖాతాలు, విద్యార్థుల ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంక్ ఎటువంటి రుసుము వసూలు చేయదు. డెబిట్‌ కార్డు పోతే మరో కార్డు జారీ చేసేందుకు ఒక్కో కార్డుకు రూ. 200 చొప్పున బ్యాంకు వసూలు చేస్తుంది. భారతదేశం వెలుపల (విదేశాల్లో) ATMలో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకుంటే ప్రతిసారీ 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.