PM Modi Nomination in Varanasi: ప్రధాని నరేంద్ర మోదీ మే 14వ తేదీన వారణాసి నుంచి (PM Modi Nomination) నామినేషన్ వేయనున్నారు. కాలభైరవుని ఆశీర్వాదం తీసుకుని ఆ తరవాత నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌కి ఆహ్వానం పంపారు ప్రధాని మోదీ. అయితే...మోదీ నామినేషన్‌ వేస్తున్న ముహూర్తంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పుష్య నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు ముహూర్తం పెట్టిన పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి ద్రవిడ్‌ (Pandit Ganeshwar Shastri Dravid) మోదీ నామినేషన్‌కీ (Pushya Nakshatra) ముహూర్తం పెట్టారు. మే 14న దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పారు. ఆయన సలహా మేరకు ఆ రోజే ప్రధాని నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. జ్ఞానేశ్వర్ శాస్త్రి వెల్లడించిన వివరాల ప్రకారం పుష్య నక్షత్రం మే 13వ తేదీన అర్ధరాత్రి 01.43 నిముషాలకు ప్రారంభమై మే 14న మధ్యాహ్నం 3.10 గంటలకు ముగుస్తుంది. ఆ తరవాత ఆశ్లేష నక్షత్రం మొదలవుతుంది. ప్రధాని మోదీ జాతకం ప్రకారం ఈ ముహూర్తం బాగుందని సూచించారు జ్ఞానేశ్వర్ శాస్త్రి. ఆయన నామినేషన్ దాఖలు చేసే సమయానికి గ్రహాలు అనుకూలిస్తాయని వివరించారు.  


పుష్య నక్షత్రం చాలా పవిత్రమైంది. దీన్నే పుష్యమి లేదా పూయమ్ అని పిలుస్తారు. సంపద కలగడానికి, అభివృద్ధికి బాగా కలిసొచ్చే నక్షత్రం ఇది. అందుకే ఈ ముహూర్తంలో ఏ పని చేసినా మంచి జరుగుతుందని చెబుతారు. మే 14వ తేదీన పవిత్రమైన గంగాసప్తమి కూడా ఉండడం మరో విశేషం. ఈ రోజునే బ్రహ్మ కమండలంలో నుంచి గంగాదేవి అవతరించిందని చెబుతారు. ఇంత ప్రాశస్త్యం ఉంది కాబట్టే ఆ రోజునే మోదీ నామినేషన్ వేయనున్నారు. అంతకు ముందు గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. అయితే..ఆ రోజు ఆయన పూర్తి షెడ్యూల్ ఏంటన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.