Election Commission Transfered Police Officers In Tirupati: ఏపీలో మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం (Election Commission) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో కొందరు పోలీస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, ఓ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై పలువురు నేతల ఫిర్యాదుల ఆధారంగా విచారించిన ఈసీ ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. తాజాగా, తిరుపతికి (Tirupati) చెందిన మరో ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో.. సీఐలు జగన్మోహన్ రెడ్డి, అంజూయాదవ్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, వినోద్ కుమార్ లను అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వహించాలని ఆదేశించింది.


నంద్యాల పోలీసుల తీరుపై ఆగ్రహం


అటు, ఎన్నికల కోడ్ అమల్లో విఫలమయ్యారంటూ నంద్యాల పోలీసుల తీరుపైనా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ఆయనతో పాటు ఎస్ డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం రాత్రి 7 గంటల్లోగా తెలియజేయాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. కాగా, సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం నంద్యాలలో పర్యటించగా అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఈసీ తెలిపింది. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి శనివారం ఉదయం అల్పాహారానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలిరాగా.. వారికి అభివాదం చేస్తూ అల్లు అర్జున్ వారి ఇంటికి వచ్చారు. ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి రాగా.. భారీ జన సమీకరణ, 144 సెక్షన్ అమల్లో ఉన్నా జనాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఆయన పర్యటనకు ఎలాంటి అధికారిక అనుమతి లేకపోయినా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొందరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం శాఖాపరమైన విచారణ జరిపి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కేసును క్లోజ్ చేయవద్దని ఆదేశాల్లో స్పష్టం చేసింది.


Also Read: Ap Elections: ఓటింగ్ కు అంతా సిద్ధం - సీఎం జగన్, చంద్రబాబు, పవన్ ఎక్కడ ఓటేస్తారంటే?