PM MODI: ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం. ఇవాళ్టితో 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పేరుతో చేతివృత్తుల వారి జీవనోపాధి కోసం ప్రతిష్టాత్మకంగా పథకాన్ని తీసుకురానుంది. అలాగే ఆయుష్మాన్ భవ పేరుతో కొత్త ఆరోగ్య ప్రచారాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం పని చేసిన కాంగ్రెసేతర ప్రధాన మంత్రి మాత్రమే కాదు, దేశంలోని ఎక్కువ కాలం పదవిలో ఉన్న వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు. 12 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, రెండు సార్లు ప్రధానిగా ఎన్నుకోబడిన కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా నిలిచారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రధాని మోదీ 73వ వసంతంలోకి అడుగుపెట్టడంతో బీజేపీ పార్టీ.. ఎంపిక చేసిన 73 కుటుంబాలకు పీజీ రేషన్ కార్డులు, 73 భగవద్గీత పుస్తకాలను అందజేయనుంది. ప్రధాని మోదీ జన్మదినం రోజును ప్రత్యేకంగా ఉండేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలా గత ఐదేళ్లలో మోదీ తన పుట్టినరోజును ఎలా జరుపుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.






2022లో జన్మదిన వేడుకలు ఎలా జరిగాయంటే?


నరేంద్ర మోదీ స్వాతంత్ర భారతావనిలో 1950 సెప్టెంబర్ 17వ తేదీన అంటే స్వతంత్ర వచ్చిన మూడేళ్లకు జన్మించారు. దామోదర్ దాస్ మోదీ, హీరాబా మోదీల ఆరుగురరు సంతానంలో మూడోవాడు నరేంద్ర మోదీ. 2022 లో తన పుట్టిన రోజు నాడు ప్రధాని మోదీ నమీబియా నుంచి తెచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలిపెట్టారు. అలా ప్రాజెక్టు చిరుతకు బీజం వేశారు. 


2021లో కరోనా టీకాల పంపిణీ


2021 లో దేశంలో కరోనా ఉద్ధృతంగా ఉంది. దేశవ్యాప్తంగా విపరీతంగా కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలోనే ప్రధాని మోదీ జన్మదినం వచ్చింది. ప్రజల బాధలను దృష్టిలో ఉంచుకుని తన పుట్టినరోజు నాడు వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 2.26 కోట్ల టీకాలను పంపిణీ చేశారు.


2020లో సేవా సప్తా పేరుతో వేడుకలు


2020 లో కరోనా వ్యాప్తి జోరుగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా సప్తా పేరుతో నిర్వహించాయి. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అదే ఏడాది మోదీ పాలనలో ఎన్డీఏ సర్కారు సాధించిన విజయాలతో లార్డ్ ఆఫ్ రికార్డ్స్ పేరుతో జేపీ నడ్డా పుస్తకాన్ని విడుదల చేశారు.


2019లో నమామి నర్మదా ఉత్సవాలు


2019 లో తన జన్మదినం నాడు నరేంద్ర మోదీ తన తల్లి హీరెబన్ తో గడిపారు. పుట్టినరోజు సందర్భంగా నమామి నర్మదా ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 


2018 పుట్టిన రోజు నాడు కాశీలో ప్రత్యేక పూజలు


2018లో ప్రధాని మోదీ 68వ జన్మదినం జరుపుకున్నారు. ఆ ఏడాది ఆయన వారణాసిలో గడిపారు. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నరోర్ ప్రాథమిక పాఠశాల పిల్లలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.