PM MODI TALKs LOKESH: ప్రధాని విశాఖ(VIZAG) పర్యటనలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. భారీ ర్యాలీగా సీఎం చంద్రబాబు (Chandra Babu), పవన్‌కల్యాణ్‌తో కలిసి సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ (MODI)ని వేదికపై ఉన్న మంత్రులు, ఇతర ముఖ్య నేతలు మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలుకుతూ నమస్కరించారు. వారిని సీఎం చంద్రబాబు పరిచయం చేస్తుండగా... ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి లోకేశ్(LOKESH) వద్దకు రాగానే ప్రధాని మోదీ ఆయనకు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నీ మీద నాకు ఓ ఫిర్యాదు అందింది అంటూనే... పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు వంక చూస్తూ... ఈ విషయం మీకు కూడా తెలుసుగా అంటూ చూశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. అయినా నువ్వు ఇప్పటి వరకు వచ్చి నన్ను కలవలేదంటూ చమత్కరించారు. కుటుంబంతో సహా వచ్చి ఒకసారి కలవాలంటూ ఆయన లోకేశ్ భుజం తట్టారు. వెంటనే లోకేశ్ తప్పకుండా వచ్చి కలుస్తానంటూ ఆయన వినయపూర్వకంగా నమస్కరించారు.
ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటింది. ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రపెద్దలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని అనేకసార్లు కలిశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి అమిత్‌షా(Amith Sha) సహా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. కానీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడమే గాక, స్వయంగా ముఖ్యమంత్రి తనయుడైన లోకేశ్ మాత్రం డిల్లీ(Delhi) వెళ్లడం చాలా అరుదుగా చేస్తుంటారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఢిల్లీ వెళ్లారు. అదీకూడా అధికారిక కార్యక్రమాలపై మాత్రమే. అప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రిని కలవకుండానే వెనుదిరిగి వచ్చేశారు. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని చమత్కరించి ఉంటారని అనుకుంటున్నారు. గతంలో లోకేశ్ మంత్రిగా పనిచేసినప్పటికీ ఎప్పుడూ ఆయన ఢిల్లీ పెద్దలను కలిసింది లేదు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రధానిని కలిసి జరిగిన విషయం మొత్తం వివరించారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన మోదీనిగానీ, అమిత్‌షాను గానీ కలిసిన దాఖలాలు లేవు.