PM Modi Speech in Rajya Sabha: రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. నెహ్రూ పాలన నుంచి యూపీఏ అధికారం కోల్పోయేంత వరకూ దేశాన్ని సర్వనాశనం చేశారంటూ మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించిందే బ్రిటీష్ వాళ్లని విమర్శించారు. యూపీఏ పాలనలో దేశం వెనకబడిపోయిందని అన్నారు. అప్పటి ప్రధాని అన్ని రకాల రిజర్వేషన్‌లనూ వ్యతిరేకించారని,దీనిపై ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖలు రికార్డుల్లో ఉన్నాయని తేల్చి చెప్పారు. రాజ్యాంగకర్త అంబేడ్కర్‌కి భారత రత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కి మనసొప్పలేదని, తమ కుటుంబ సభ్యులకు మాత్రం భారతరత్న ఇచ్చుకున్నారని మండి పడ్డారు. ఇప్పటికీ కాంగ్రెస్ నెహ్రూనే గుడ్డిగా అనుసరిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదని అసహనం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తే ప్రభుత్వ స్థాయి పడిపోతుందని నెహ్రూ అనేవారని గుర్తు చేశారు. ఇలాంటి వైఖరి ఉన్న కాంగ్రెస్‌ని ఎవరూ మార్చలేరని మండి పడ్డారు.
"భారత దేశ సంస్కృతిలో ఏ గొప్పదనమూ లేదేమో అని ప్రజలంతా ఆత్మన్యూనతతో ఉండిపోయేలా చేసింది కాంగ్రెస్. మేడ్ ఇన్ ఫారిన్ అనేది అప్పట్లో ఓ స్టేటస్ సింబల్‌గా మార్చేసింది. ఈ కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడూ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ గురించి మాట్లాడలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో నాలుగు కీలక విషయాలు చెప్పారు. యువత, మహిళ, నిరుపేదలు, రైతుల గురించి ప్రస్తావించారు. వాళ్లందరి సమస్యల్ని పరిష్కరించగలిగే మార్గాలున్నాయి"
- ప్రధాని నరేంద్ర మోదీ
గుజరాత్‌ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేసిందని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ తనను కేంద్రమంత్రులతో కలవనివ్వలేదని మండిపడ్డారు. నెహ్రూ అప్పట్లో రిజర్వేషన్‌లపై ముఖ్యమంత్రులకు రాసిన లేఖని సభలో చదివి వినిపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండి పడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడో విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు.
"SC,ST,OBC రిజర్వేషన్లు ఇస్తే ప్రభుత్వ స్థాయి పడిపోతుందని నెహ్రూ అనే వారు. ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్‌లను వ్యతిరేకించారు. ఉద్యోగుల నియామకాలనూ ఆపేశారు. ఇదొక్కటి చాలు కాంగ్రెస్ వైఖరి ఏంటో అర్థం చేసుకోడానికి. SC,ST వర్గాలకు ఎప్పుడూ కాంగ్రెస్ వ్యతిరేకంగానే పరిపాలించింది. కానీ మేం ఆదివాసులకు, దళితులకు ప్రాధాన్యతనిచ్చాం. వాళ్లూ ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలు పొందుతున్నారు"
- ప్రధాని నరేంద్ర మోదీ