Paytm Bank Crisis: కేంద్ర ప్రభుత్వం Paytm Payment Bank పై ఆంక్షలు విధించడం ఆ సంస్థను బాగా దెబ్బ తీసింది. ఇప్పటికే స్టాక్‌మార్కెట్‌లో భారీగా నష్టపోయింది. ఈ క్రమంలోనే పేటీఎమ్‌ సీఈవో విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 6వ తేదీన ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సంక్షోభంపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే RBI ఉన్నతాధికారులతో ఓ సారి భేటీ అయ్యారు శేఖర్ శర్మ. అయితే...ఆంక్షలు ఎత్తివేస్తామన్న భరోసా మాత్రం RBI ఇవ్వలేదు. అందుకే....నేరుగా ఆర్థిక మంత్రినే కలవాలని సీఈవో భావించినట్టు తెలుస్తోంది. అటు ఈడీ కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమైంది. కానీ అటు పేటీఎమ్ సంస్థ మాత్రం బ్యాంక్‌కి అవసరమైన వివరాలన్నీ  సమర్పించినట్టు వెల్లడించింది. ఈడీ దర్యాప్తుని తిరస్కరించింది. 


"పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్ లిమిటెడ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తుందని మీడియాలో కొందరు తప్పుడు వార్తలు వస్తున్నాయి. మేం చాలా రోజులుగా వీటిని గమనిస్తున్నాం. కొన్ని నిబంధనలకు విరుద్ధంగా మేం నడుచుకున్నామని చెబుతున్నారు. ఇవేవీ నిజం కాదు. మా తరపున కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాం"


- పేటీఎమ్‌ పేమెంట్స్ బ్యాంక్‌ 


ఈ వదంతులను ఎవరూ నమ్మకూడదని వెల్లడించింది పేటీఎమ్ సంస్థ. ఇవి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. తమ వినియోగదారులో తాము పూర్తి పారదర్శకంగా ఉన్నామని తేల్చి చెప్పింది. మనీలాండరింగ్ ఏమీ జరగలేదని, అయినా మేం విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని వెల్లడించింది. మనీలాండరింగ్ జరిగితే ముందుగా తామే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది పేటీఎమ్ సంస్థ. వారం రోజుల క్రితం పేటీఎమ్‌పై RBI ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి ఈ సంక్షోభం కొనసాగుతోంది. పేటీఎమ్‌లో వందలాది అకౌంట్‌లకు సరైన ఐడెంటిఫికేషన్ లేదని RBI తీవ్ర అసహనంతో ఉంది. అందుకే ఆ కంపెనీపై ఆంక్షలు విధించినట్టు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయా అకౌంట్‌లు Know-Your-Customer (KYC) సరైన విధంగా చేయకుండానే నడుస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్‌ గుర్తించింది. అయినా అదే ఖాతాల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగే ప్రమాదముందని RBI తేల్చి చెబుతోంది. వెయ్యికి పైగా అకౌంట్స్‌ ఒకటే PAN నంబర్‌తో లింక్ అయ్యి ఉండడం ఆందోళన కలిగించింది. రిజర్వ్ బ్యాంక్ వెరిఫికేషన్‌లో ఈ లొసుగు బయటపడింది. మనీ లాండరింగ్ కోసమే ఇలా కొంత మంది ఒకటే ప్యాన్ నంబర్ ఇచ్చి ఉండొచ్చని RBI భావిస్తోంది. ఇదే విషయాన్ని ఈడీతో పాటు హోం మంత్రిత్వ శాఖకి, ప్రధాని కార్యాలయానికి వెల్లడించింది. ఈ వివరాలు పంపింది. Paytm Payments Bank లో ఏవైనా అవకతవకలు జరిగాయని తెలిస్తే వెంటనే ఈడీ రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 


Also Read: మంచి పనులు చేసిన వారికి ఎప్పుడూ గౌరవం ఉండదు - నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు