Paytm Crisis: ఫిన్‌టెక్ ప్రపంచంలో ప్రస్తుతం పేటీఎం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL) మీద రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న చర్యలతో ఫిన్‌టెక్ ప్రపంచం ఉలిక్కిపడింది. తమవైపు తప్పులేమైనా ఉన్నయేమని మిగిలిన ఫిన్‌టెక్‌ కంపెనీలు కూడా క్రాస్‌ చెక్‌ చేసుకుంటున్నాయి. ఓపైపు, పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోతుంటే.. మరోవైపు, పెద్ద సంఖ్యలో యూజర్లు దూరమవుతున్నారు. అసలు పేటీఎంకు ఈ ఇబ్బందులు ఎలా వచ్చాయి?. ఇటీవలే రిలీజ్‌ అయిన రిపోర్ట్‌లో ఆ సంగతులన్నీ పూసగుచ్చినట్లు వెల్లడయ్యాయి.


KYCలో భారీ అక్రమాలు
తాము మనీలాండరింగ్‌కు పాల్పడలేదని, ఏ నిబంధనలు ఉల్లంఘించలేదని పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ చెబుతున్నా.. నివేదికలో వెల్లడైన విషయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వన్‌97 కమ్యూనికేషన్స్‌ ‍‌(One97 Communications) బ్యాంకింగ్‌ యూనిట్ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో, అకౌంట్‌ KYCకి సంబంధించి చాలా అక్రమాలు జరిగాయని NDTV రిపోర్ట్‌ సూచిస్తోంది. ఒకే పాన్ నంబర్‌తో వెయ్యికి పైగా ఖాతాలు లింక్ అయినట్లు తేలింది. ఇలా చేయకూడదన్న చిన్న లాజిక్‌ను పేటీఎం మిస్‌ అయింది. ఆర్‌బీఐకి ఇక్కడే అనుమానం వచ్చిందని సమాచారం. అంతేకాదు, పెద్ద సంఖ్యలో డోర్మాంట్ ఖాతాలు (చాలా కాలం నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాలు) కూడా కనిపించాయి. దీని ఫలితంగా, ఈ ఏడాది జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ మీద ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంది.


NDTV రిపోర్ట్‌ ప్రకారం, సరైన గుర్తింపు పత్రాలు లేకుండానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో వేలాది ఖాతాలు ఓపెన్‌ అయ్యాయి. ఈ ఖాతాలకు కేవైసీ లేకపోయినా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి. దీంతో మనీలాండరింగ్‌పై అనుమానాలు బలపడుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఇన్‌యాక్టివ్ ఖాతాలు ఉండడం, ఒకే పాన్‌కు (PAN) లింక్ అయిన వేలాది ఖాతాలు బయటపడడం వల్ల కూడా విజయ్‌ శేఖర్‌ శర్మ సమస్యలు పెరిగాయి.


మాతృ సంస్థతో సంబంధంలోనూ అవకతవకలు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ నిర్వహణలో నిబంధనలకు పాతరేసినట్లు వెరిఫికేషన్ సమయంలో రిజర్వ్ బ్యాంక్, ఆడిటర్లు గుర్తించారు. కంపెనీలో కార్పొరేట్‌ యాక్షన్లకు సంబంధించి అవకతవకలను కూడా రిజర్వ్ బ్యాంక్‌ గుర్తించింది. ప్రత్యేకించి, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్ మధ్య సంబంధానికి సంబంధించి కొన్ని అక్రమాలు/లోపాలు బయటపడ్డాయట. ఈ దర్యాప్తు ఫలితాలను హోం మంత్రిత్వ శాఖకు, ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా సెంట్రల్ బ్యాంక్‌ పంపింది.


వాస్తవానికి, ఈ లోపాలన్నింటి గురించి దాదాపు ఆరు నెలల ముందే ఆర్‌బీఐకి ఉప్పందినట్లు మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తప్పులు సరిదిద్దుకోమని అప్పట్లోనే పేటీఎంను ఆర్‌బీఐ హెచ్చరించిందట. ఆ వార్నింగ్‌ను విజయ్‌ శేఖర్‌ శర్మ లైట్‌గా తీసుకోవడంతోనే ఇప్పుడీ దుస్థితికి వచ్చారని అనుకుంటున్నారు.


ఈ నెల 29 తర్వాత, పేటీఎం బ్యాంకింగ్ యూనిట్‌ కొత్త కస్టమర్లను & క్రెడిట్ బిజినెస్‌లను యాడ్ చేయకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. పేటీఎం వాలెట్‌కు సంబంధించిన అనేక సేవలను ఫిబ్రవరి 29 తర్వాత మూసివేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 29 తర్వాత, కస్టమర్లు పేటీఎం వాలెట్‌లోకి డబ్బు యాడ్‌ చేయలేరు, కానీ ఉన్న బ్యాలెన్స్‌ను వాడుకోవచ్చు. ఈ కారణంగా, పేటీఎం ఫాస్టాగ్‌ (Paytm Fastag) వంటి చాలా సర్వీసులు ప్రభావితం అవుతాయి. 


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి