TDP Janasena Alliance Update: ఏపీ రాజకీయ చిత్రపటంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఉన్న పట్టు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎందుకంటే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా దానికి కుడిభుజంగా తూర్పు చాలా కీలకంగా నిలుస్తుంటుంది. అయితే 2009 ఎన్నికల్లో తూర్పులో నాలుగు స్థానాలు దక్కించుకున్న ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 స్థానాలకే పరిమితమైంది.. అయితే అప్పట్లో ప్రజారాజ్యం పట్టునిలుపుకున్న నియోజకవర్గాల్లోనే తమ బలం కూడా అంతేస్థాయిలో ఉందంటూ జనసేన పార్టీ కొత్త రాగం అందుకుందట.. అప్పట్లో ప్రజారాజ్యం గెలిచిన స్థానాలు ఇప్పుడు జనసేన కూడా అంతే పట్టును సాధించిందని, ఈ ఎన్నికల్లో జనసేనకు కేటాయిస్తే నల్లేరుమీద నడక చందంగా గెలిచి తీరుతామని జనసేన ఇప్పటికే టీడీపీ ముందు ఒక ప్రపోజల్‌ కూడా పెట్టిందట... 


2009లో ఏం జరిగింది..? జనసేన ఏం కోరుతోంది..?
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగి ఉమ్మడి తూర్పుగోదావరిలో చాలా స్థానాలు కైవశం చేసుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు.. అయితే పిఠాపురం, కాకినాడ రూరల్‌, కొత్తపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోనే ప్రజారాజ్యం గెలిచిన పరిస్థితి కనిపించింది. అప్పట్లో మరో ఎనిమిది స్థానాల్లోనూ ప్రజారాజ్యం రెండో స్థానంలో నిలవడంతో ఇప్పుడు జనసేన కూడా ఇదే స్ట్రాటజీను అమలుచేయాలని ఆలోచిస్తోందని జనసేన కోరుతున్న సీట్లు విషయాన్ని బట్టి అర్ధమవుతుందంటున్నారు. 


పాగావేస్తామన్న దీమా ఉందా...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 12 సీట్లు జనసేన కోరుతున్నట్లు సమాచారం ఉంది.. ఎందుకంటే జనసేనకు ఉమ్మడి తూర్పుతోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కొన్ని ప్రాంతాల్లో పట్టు ఉంది. వీటిలో మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేనకు కీలకం కానుంది. అందుకే ఉమ్మడి తూర్పు అంతటా 12 సీట్లు తమకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తోందని తెలుస్తోంది.


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, రామచంద్రపురం కాగా కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్‌, పిఠాపురం, జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, రాజమండ్రి రూరల్‌, గోపాలపురం నియోజకవర్గాలు జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు 2009లో ప్రజారాజ్యం గెలుపొందిన పెద్దాపురం, కొత్తపేట నియోజకవర్గాలు కూడా తమకే కేటాయించాలని, ఈ నియోజకవర్గాల్లో తమకు చాలా పట్టుందని డిమాండ్‌ చేస్తోందని తెలుస్తోంది..


టీడీపీ సీనియర్ల పరిస్థితేంటి..?
జనసేన కోరుకుంటున్నట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 12 సీట్లు కావాలని డిమాండ్‌ చేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉండి సీటు ఆశిస్తున్నవారు అంతా టీడీపీలో సీనియర్లు కావడం ఇక్కడ అసలు ట్విస్ట్‌. పార్టీతో ఎంతో అనుబంధం ఉండి, పార్టీలో సీనియర్లుగా ఉన్న నాయకులను టీడీపీ కాదనగలదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఉదాహరణకు కొత్తపేట నియోజకవర్గంకు బండారు సత్యానందరావు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీలో సీనియర్‌ నేత, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా.. పెద్దాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మకాయల చినరాజప్ప డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేత, బాగా సీనియర్‌ ఈయనను జనసేన కోసం పక్కన పెడతారా అన్నది ప్రశ్నగా మారింది. ఇక రాజోలులో టీడీపీ అభ్యర్ధిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు కూడా సీనియర్‌, మాజీ మంత్రి.. ఈయన భవితవ్యం కూడా సందిగ్ధంలో పడిన పరిస్థితి తలెత్తింది.. ఇలా సీనియర్లు అయిన పిల్లి అనంతలక్ష్మి, పిఠాపురం వర్మ తదితర టీడీపీ సీనియర్‌ నాయకులు వారి అభ్యర్ధిత్వంపై సందిగ్ధత నెలకొంది.