Janasena Chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (YSRCP MLA Dwarampudi) సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడ సిటీ స్థానం నుంచి పోటీ చేయాలని, జనసేన గాజు గుర్తును ఎన్నికల్లో తనపై పోటీకి పెట్టాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. పవన్ పోటీకి రాకుండా తోకముడిస్తే.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ తనపై చేసిన ఆరోపణలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని, అందుకు పవన్ సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు.
తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ సిటీలో పర్యటించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించారంటూ ద్వారంపూడి పవన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని ఓడించాలంటూ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.
తాను న్యాయబద్ధంగానే సంపాదిస్తున్నానని, అడ్డగోలుగా సంపాదించినట్లు నిరూపిస్తే ఆస్తి రాసిస్తానని ద్వారంపూడి స్పష్టం చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన వార్ రాష్ట్రస్థాయిలోనే అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మళ్లీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను పోటీకి రావాలంటూ కోరడం రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ద్వారంపూడి విసిరిన సవాలను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారా..? లేక తనదైన శైలిలో ద్వారంపూడి కి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.