Sandeep Reddy Vanga: తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ‘యానిమల్‘పై పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి తీవ్ర ముప్పు తప్పదని మరికొందరు వ్యాఖ్యానిస్తే, స్త్రీలను మరీ దారుణంగా చూపిస్తున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న సందీప్ రెడ్డి, తనపై విమర్శలు చేసిన వారిపై వరుసబెట్టి కౌంటర్లు ఇస్తున్నారు. బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్, ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సహా పలువురుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు తమ కుటుంబ సభ్యులు తీసిన సినిమాల గురించి మాట్లాడి, తర్వాత ‘యానిమల్‘ గురించి స్పందిస్తే మంచిదన్నారు.


‘యానిమల్’ మూవీని చూసిన సందీప్ కుటుంబ సభ్యులు ఏమన్నారంటే?


తాజాగా ‘యానిమల్‘ సినిమా విషయంలో తన కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన స్పందన ఏంటనే విషయంపై సందీప్ స్పందించారు. ‘యానిమల్‘ చిత్రాన్ని తన భార్య, కొడుకుకు చూసి ఏమన్నారో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో స్త్రీ పాత్రలను చూపించి విధానంపై తన భార్య ఎలాంటి కంప్లైంట్స్ చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే, వయిలెన్స్ విషయంలో మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఇక ఈ సినిమా ఎడిటెడ్ వెర్షన్ ను తన కొడుకు కూడా చూసినట్లు చెప్పారు సందీప్. ఇప్పటికే తన కొడుక్కు అర్జున్ రెడ్డి అని పేరు పెట్టుకున్నట్లు చెప్పిన సందీప్, ‘యానిమల్’ విషయంలో అతడికి హిట్, సూపర్ హిట్ అనే కాన్సెప్ట్ పెద్దగా అర్థం కాలేదన్నారు. అయితే, న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో ఎడిటెడ్ వెర్షన్ ను చూసినట్లు చెప్పారు. ఈ చిత్రంలో అండర్ వేర్ యాక్షన్ సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉన్నాయని చెప్పారట. తన సినిమాలకు సంబంధించి కచ్చితమైన ఫీడ్ బ్యాక్ తన భార్య నుంచి లభిస్తుందని చెప్పారు. ‘యానిమల్’ విషయంలో రక్తపాతం ఎక్కువగా ఉందని మాత్రమే చెప్పిందని, స్త్రీ ద్వేషం సహా ఇతర అంశాలపై ఏం చెప్పలేదన్నారు.  


నన్ను దర్శకుడిగా నిలబెట్టిందే ప్రణయ్- సందీప్  


ఇక దర్శకుడిగా నిలబడేందుకు తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చాలా కృషి చేశారని సందీప్ గుర్తు చేశారు. ఆయన చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి, తనను దర్శకుడిగా నిలబెట్టారని చెప్పారు. ‘తన సినిమా చిత్రీకరణ సమయంలో ఫైనాన్షియర్లు వెనక్కి తగ్గడంతో ఆయనకు సంబంధించిన 36 ఎకరాల భూమిని అమ్మి డబ్బులు సినిమా కోసం ఖర్చుపెట్టినట్లు చెప్పారు. ఆయన లేకపోతే సినిమా పూర్తి అయ్యేది కాదన్నారు. మొత్తంగా ‘యానిమల్’ తీవ్ర విమర్శలకు ఎదుర్కొన్నా ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 'యానిమల్' సక్సెస్ తర్వాత సందీప్ వంగా రేంజి మరింత పెరిగింది. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి బాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నారు. అటు ‘యానిమల్’కు సీక్వెల్ గా ‘యానిమల్ పార్క్’ను తెరకెక్కించనున్నట్లు తెలిపారు.


Read Also: జాన్వీ రాగానే.. ఆమె వెంట పడ్డారు, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు - నెపోటిజంపై మృణాల్ ఘాటు వ్యాఖ్యలు