ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్‌పుర్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ABP న్యూస్ సమాచారం మేరకు ఈ కమిటీ మూడు రోజుల్లోనే తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
ఈ కమిటీలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిటైర్డ్ జస్టిస్ మెహ్‌తబ్ సింగ్ గిల్, జస్టిస్ అనురాగ్ వర్మ సభ్యులుగా ఉన్నారు.
సుప్రీం కోర్టు..
ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు సీనియర్ అడ్వకేట్ మనిందర్ సింగ్. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పిటిషన్ కాపీలను కేంద్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వాలకు గురువారమే పంపించాలని న్యాయవాదికి సూచించింది సుప్రీం కోర్టు. పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
ఏం జరిగింది?
పంజాబ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు భఠిండా విమానాశ్రయానికి బుధవారం ఉదయం మోదీ చేరుకున్నారు. అక్కడి నుంచి హుస్సేనీవాలాలోని స్వాతంత్య్ర సమర యోధుల స్మారకం వద్ద నివాళి అర్పించేందుకు హెలికాప్టర్లో వెళ్లాలనుకున్నారు. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల 20 నిమిషాలపాటు మోదీ ఎదురు చూడాల్సి వచ్చింది.
పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల రోడ్డు మార్గంలో మోదీ కాన్వాయ్ బయలుదేరింది. గమ్యస్థానానికి మరో 30 కిలోమీటర్ల దూరం ఉండగా ఆయన కాన్వాయ్‌ను ఫ్లైఓవర్‌పై కొంతమమంది నిరసనకారులు అడ్డుకున్నారు. ఫ్లైఓవర్‌పై 15 నుంచి 20 నిమిషాలపాటు మోదీ కాన్వాయ్ ఉండిపోయింది. ఇది భద్రతాపరమైన సమస్యలకు కారణమైంది. దీంతో ప్రధాని మోదీ తిరిగి భఠిండా విమానాశ్రయానికి వెళ్లారు. అటు నుంచి దిల్లీకి పయనమయ్యారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అయితే భద్రతా వైఫల్యాల వల్లే ప్రధాని పర్యటన రద్దయిందనే వాదనను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. అసలు ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తున్నారనే సమాచారమే తమకు అందలేదన్నారు. ప్రధాని పర్యటన రద్దు కావడంపై చింతిస్తున్నామన్నారు.
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని