PM Modi Security Breach:


లోపం లేదు..


కర్ణాటకలో ప్రధాని మోడీ రోడ్‌షోలో భద్రతా లోపం తలెత్తడం సంచలనమైంది. కాన్వాయ్‌ బయటకు వచ్చి మోడీ అందరికీ అభివాదం చేస్తుండగా ఉన్నట్టుండి ఓ యువకుడు ఆయన వద్దకు పరిగెత్తుకొచ్చాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పక్కకు తప్పించింది. అయితే...ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. మోడీ వచ్చే ముందు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశామని స్పష్టం చేశారు. ఆ రోడ్ మొత్తాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) పహారా కాసిందని వెల్లడించారు. ఇందులో భద్రతా లోపం ఏమీ లేదని తెలిపారు. "సెక్యూరిటీ లోపం ఏమీ లేదు. ప్రధాని మోడీయే స్వయంగా ఆ యువకుడు తెచ్చిన పూమాలను తీసుకున్నారు" అని అన్నారు. కర్ణాటకలో యూత్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన తరవాత ప్రధాని హుబ్లీలో ఈ రోడ్‌షో నిర్వహించారు. ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ దాదాపు 5 రోజుల పాటు కొనసాగనుంది. 30 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. ఈ వేదికపై ప్రధాని కూడా ప్రసంగించనున్నారు. 










ఆపరేషన్ కర్ణాటక..


కర్ణాటకలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటోంది బీజేపీ. మిషన్ కర్ణాటకపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. మరోసారి కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి రావాలని బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే...స్వయంగా ప్రధాని మోడీయే రంగంలోకి దిగారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కర్ణాటకలోనూ గుజరాత్ ఫలితాలు రిపీట్ అవుతాయని చాలా ధీమాగా చెబుతున్నారు. గతేడాది అక్టోబర్‌లోనూ గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటించారు.  భరూచ్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి 'బల్క్ డ్రగ్ పార్క్'కి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జామ్‌నగర్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌షో సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఒక్కసారిగా కారు దిగి.. రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఇది చూసి అక్కడున్న ప్రజలతో పాటు, భద్రతా సిబ్బంది కూడా షాకయ్యారు. ప్రధాని మోదీని చూసేందుకు ఓ వ్యక్తి  ఒక చిత్రపటం పట్టుకుని అక్కడ నిల్చొని ఉన్నాడు. ఇది గమనించిన మోదీ కారు దిగి నేరుగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. వెంటనే ఆ వ్యక్తి ఓ చిత్రాన్ని మోదీకి బహూకరించారు. ఆ చిత్రంలో ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌ ఉన్నారు. దీంతో ఫోటోపై ప్రధాని ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు.


Also Read: Electric Vehicles Benefits: ఎలక్ట్రిక్ వాహనాలతో పర్యావరణాన్నే కాదు, ట్యాక్స్ కూడా ‘సేవ్’ చేయొచ్చు - ఇదిగో ఇలా!