ఉచిత హామీలతో సాధించేది ఏమీ లేదు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రతిపక్షాలకు తనదైన స్టైల్‌లో చురకలంటించారు. "షార్ట్‌కర్ట్ పాలిటిక్స్" అంటూ సెటైర్లు వేశారు. రాజకీయాల్లో షార్ట్‌కట్స్, దేశాన్ని నాశనం చేస్తాయంటూ హెచ్చరించారు. ఝార్ఖండ్‌లోని డియోగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంలో..అక్కడి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త ఎయిమ్స్ ఆసుపత్రినీ ప్రారంభించారు. "షార్ట్‌కట్ రాజకీయాలకు దూరంగా ఉండి. ఇవే షార్ట్‌సర్క్యూట్‌లకు దారి తీస్తాయి" అని అన్నారు ప్రధాని మోదీ. ఇదే సమయంలో "ఉచిత" హామీల గురించీ ప్రస్తావించారు. ఉచిత హామీలు కొత్త విమానాశ్రయాలను, ఆసుపత్రులను నిర్మించలేవని విమర్శించారు. "అన్నీ ఉచితంగానే అందిస్తే, దేశానికి అవసరమైన ఎయిర్‌పోర్ట్‌లు, ఆసుపత్రులు ఎలా కడతారు" అని ప్రశ్నించారు.
ఓ నిర్మాణం పూర్తయ్యేలోపు ఎన్నో ప్రభుత్వాలు మారిపోతాయ్..
దేశంలోనే అత్యంత వెనకబడిన రాష్ట్రంగా ఉంది ఝార్ఖండ్. ఇలాంటి చోట ప్రభుత్వం ఇష్టారీతిన ఉచిత హామీలు అందించింది. సీఎం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్నో సబ్సిడీలూ ప్రకటించారు. దిల్లీ తరహాలోనే ఝార్ఖండ్‌లోనూ ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. రైతుల రుణమాఫీ లాంటి ఇతర పథకాలూ అమల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల హామీలే. వీటిని నెరవేర్చటం కోసం కిందామీదా పడుతోంది అక్కడి ప్రభుత్వం. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. "గతంలో ఒక ప్రభుత్వం హామీ ఇస్తే, రెండు మూడు ప్రభుత్వాలు మారాక అది నెరవేర్చేందుకు పనులు మొదలు పెట్టేవారు. ఒకరు ఫౌండేషన్ స్టోన్ వేస్తే, తరవాతి ప్రభుత్వాలు ఇటుకలు వేసేవి. ఎన్నో ప్రభుత్వాలు మారితే తప్ప అసలు నిర్మాణం పూర్తయ్యేది కాదు" అని ఎద్దేవా చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో సేవలు..
డియోగర్‌లో విమాన సేవలు అందుబాటులోకి రావటం వల్ల పర్యాటకంగానూ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ బాబా బైద్యనాథ్ ఆలయం, త్రికుట పర్వత, రామకృష్ణ మిషన్ విద్యాపీఠ్, నకుల మందిర్ లాంటి పర్యాటక ఆకర్షణలున్నాయి. ఎయిర్ సర్వీసెస్ వల్ల పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలున్నాయి. రాంచీలో ఇప్పటికే బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, ఇప్పుడు డియోగర్ ఎయిర్‌పోర్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. 657ఎకరాల్లో రూ.401 కోట్లతో ఈ విమానాశ్రయం నిర్మించారు. 2,500 మీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. ఎయిర్‌బస్‌లు సులువుగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందుకు వీలవుతుంది. 5,130 చదరపు అడుగుల్లో టర్మినల్ నిర్మాణం చేపట్టారు. ఇందులో 6 చెక్ ఇన్ డెస్క్‌లు ఉంటాయి. ఒకేసారి 200 మంది ప్రయాణికులు వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేశారు. పర్యావరణహితంగా నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో అధునాతన సౌకర్యాలున్నట్టు అధికారులు తెలిపారు.
Also Read: Sri Lanka Crisis: 'మాకు ఏం సంబంధం లేదు'- ఆ వార్తలను ఖండించిన భారత్