Sudha Murty's First Speech In Rajya Sabha: రాజ్యసభలో తొలిసారి ప్రసంగించిన సుధామూర్తిని ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతూ ఆమె స్పీచ్‌ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. మహిళల ఆరోగ్యం గురించి ప్రస్తావించారు సుధామూర్తి. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఓ తల్లి చనిపోతే అది హాస్పిటల్‌ రికార్డులో ఓ కేసు మాత్రమేనని, కానీ ఆ మరణం ఓ కుటుంబానికి ఎప్పటికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.


"మహిళల ఆరోగ్యం గురించి అంత గొప్పగా మాట్లాడిన సుధామూర్తికి నా ధన్యవాదాలు. మా ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. శానిటేషన్ విషయంలోనూ అవగాహన కల్పిస్తోంది. గత పదేళ్లలో ఎన్నో మార్పులు చేశాం. టాయిలెట్స్ కట్టించడం వల్ల మహిళలు ఆత్మగౌరవంగా బతుకుతున్నారు"


- ప్రధాని నరేంద్ర మోదీ


 






.సుధామూర్తి ఏం మాట్లాడారంటే..? తొలిసారి రాజ్యసభలో మాట్లాడిన సుధామూర్తి సర్వైకల్ క్యాన్సర్ ప్రస్తావన తీసుకొచ్చారు. 9-14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికులకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ టీకాలు తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు నుంచి కాపాడొచ్చని స్పష్టం చేశారు. ఈ వ్యాక్సినేషన్‌ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కొవిడ్ సంక్షోభం వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ని భారత్‌ చాలా గొప్పగా హ్యాండిల్ చేసిందని, అదే విధంగా సర్వైకల్ క్యాన్సర్‌ వ్యాక్సినేషన్‌నీ ప్రమోట్ చేయాలని అన్నారు. పశ్చిమ దేశాల్లో దాదాపు 20 ఏళ్లుగా సర్వైకల్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 


"పశ్చిమ దేశాల్లో ఇప్పటికే సర్వైకల్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి చాలా బాగా పని చేశాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ధర రూ.1,400గా ఉంది. ప్రభుత్వం చొరవ చూపించి చర్చలు జరిపితే ఆ ధర రూ.700-800 వరకూ తగ్గుతుండొచ్చు. ఇంత జనాభా ఉన్న మన దేశంలో ఇది చాలా అవసరం. బాలికలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడిన వాళ్లమవుతాం"


- సుధామూర్తి, రాజ్యసభ ఎంపీ