Modi Praises Araku Coffee: మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి మన్‌ కీ బాత్‌లో ప్రసంగించారు మోదీ. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర అంశాలు చర్చించారు. అందులో అరకు కాఫీని పొగడ్తల్లో ముంచెత్తారు. అదో అద్భుతం అని కొనియాడారు. అంతే కాదు. స్థానికంగా ఉన్న కొండదొరలు అరకు కాఫీలోని ప్రత్యేకతను ఎలా కాపాడుకుంటున్నారో కూడా వివరించారు. వాళ్ల సంస్కృతి, ఆచారాలను వదులుకోకుండా అలా జీవించడం చాలా గొప్ప విషయమని అన్నారు. కాఫీ ప్రియులందరికీ ఎంతో రుచికరమైన పొడిని అందిస్తున్నారని ప్రశంసించారు. అక్కడి కాఫీ తోటల్ని ఆక్రమించేందుకు వచ్చిన వాళ్లతో గిరిజనులు పోరాటం చేసిన తీరునీ ప్రస్తావించారు. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్లు చేసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు.





భారత్‌లో తయారవుతున్న ఈ అరకు కాఫీ పొడులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుండడంపై ఆనందం వ్యక్తం చేశారు మోదీ. అరకు కాఫీ సాగుపై దాదాపు లక్షన్నర గిరిజన కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కాఫీ తాగిన క్షణాల్ని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన G20 సదస్సులోనూ అరకు కాఫీని సర్వ్ చేశారని వెల్లడించారు. 


"భారత్‌లోని ఎన్నో ఉత్పత్తులు ఇవాళ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇది మనకి గర్వకారణం. అలాంటి ఉత్పత్తుల్లో అరకు కాఫీ కూడా ఒకటి. ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఎక్కువ మొత్తంలో కాఫీ సాగు ఉంది. దాదాపు లక్షన్నర గిరిజన కుటుంబాలు ఈ సాగుపైనే ఆధారపడి బతుకుతున్నాయి. నిజంగా ఈ కాఫీ పొడి అద్భుతం. విశాఖపట్నంలో ఓసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ కాఫీ తాగిన క్షణాల్ని మర్చిపోలేను. అరకు కాఫీకి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి"


- ప్రధాని నరేంద్ర మోదీ


మన్‌ కీ బాత్‌లో మరి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు ప్రధాని మోదీ. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన అందరినీ అభినందించారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసినందుకు థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మొక్కను నాటి అమ్మని గౌరవించుకోవాలని సూచించారు. ఏక్ పేడ్ మా కే నామ్ పేరిట ఓ క్యాంపెయిన్‌ని మొదలు పెట్టారు. 


Also Read: Joe Biden: సాయంత్రం 4 దాటితే అంతా అయోమయమే, బైడెన్ ప్రవర్తనపై సంచలన రిపోర్ట్