Joe Biden Health Status: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన పట్ల ఈ మధ్య కాలంలో బాగానే చర్చ జరుగుతోంది. మరి కొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆయన వయసైపోయిందని, ప్రెసిడెంట్ పదవికి తగరని రిపబ్లికన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లోనూ బైడెన్ పెద్దగా మాట్లాడలేకపోయారు. ట్రంప్‌కి దీటుగా సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలోనే బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఓ రిపోర్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. ఆయన కేవలం ఆరు గంటలు మాత్రమే పని చేయగలరని స్పష్టం చేసింది. అది కూడా వెలుగు ఉన్నప్పుడే అని తేల్చి చెప్పింది. కాస్తంత చీకటి పడగానే ఆయన తీరులో మార్పు వస్తోందని, ఏ పనీ చేయలేకోపోతున్నారని వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఆయన పని చేయగలరని వివరించింది. సాయంత్రం 4 గంటలు దాటితే విపరీతమైన నీరసానికి గురవుతున్నారని, విదేశాలకు వెళ్లాల్సి వచ్చిన సమయంలోనూ ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఇదంతా చూస్తుంటే ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనా ఎక్కువ కాలం పని చేయగలరా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోందని ఈ రిపోర్ట్ తెలిపింది.


అంతే కాదు. ఆయన ఎక్కువ సమయం బయట ఉండకుండా షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకుంటున్నారనీ వాదించింది. ఇప్పటికే ఆయన ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోవడం, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం లాంటివి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇలాంటి వ్యక్తికి మరోసారి అధ్యక్షుడిగా అవకాశం ఎలా ఇస్తారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే...వైట్‌హౌజ్‌లోని అధికారులు వెల్లడించిన వివరాల ఆధారంగా చూస్తే..చాలా సార్లు బైడెన్ వింతగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. అందుకే ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్ స్టెబిలిటీపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.